మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నీ జిల్లాలో వివాహానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉందనగా, ఒక యువకుడిని అతని కాబోయే భార్యే హత్య చేసిన దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
విజయరాఘవగఢ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల సునీల్, గత బుధవారం రాత్రి ఖమారియా గ్రామంలో ఉన్న తన కాబోయే మామగారి ఇంటికి వెళ్లాడు. అయితే, మరుసటి రోజు ఉదయం గ్రామ శివార్లలో అతను అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సునీల్ శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానించిన పోలీసులు, అతని కాబోయే భార్యను విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి.
అసలేం జరిగింది? విచారణలో తెలిసిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి సునీల్ సెల్‌ఫోన్‌ను ఆ యువతి పరిశీలించింది. అందులో వేరొక యువతి ఫోటో ఉండటంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహం తట్టుకోలేక ఆ యువతి ఇంట్లో ఉన్న విద్యుత్ తీగను తీసుకుని సునీల్ గొంతు బిగించి హత్య చేసింది.
నిందితురాలు మైనర్ కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. సెల్‌ఫోన్‌లోని ఒక ఫోటో కారణంగా జరిగిన గొడవ, ఒక పెళ్లి ఇంటిని శ్మశానంగా మార్చడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
