పనిచేసిన చోట ఏర్పడిన సాధారణ స్నేహాన్ని అలుసుగా తీసుకుని, ఒక వివాహితకు సంబంధించిన ఏకాంత వీడియో కాల్ స్క్రీన్షాట్లను అడ్డం పెట్టుకుని, “నన్ను పెళ్లి చేసుకో… లేదంటే వీటిని ఇంటర్నెట్లో పెడతాను” అని బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ సహోద్యోగిపై అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
ఆఫీసులో పరిచయమైన వ్యక్తే ఆమె కుటుంబ జీవితాన్ని నాశనం చేసే ఉద్దేశంతో బ్లాక్మెయిల్కు పాల్పడిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో వారి మధ్య మంచి స్నేహం ఉండేది.
ఆ సమయంలో ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకున్నప్పుడు, ఆ వ్యక్తి ఆమెకు తెలియకుండా ఏకాంత దృశ్యాలను స్క్రీన్షాట్లు తీసి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళకు పెళ్లై తన భర్తతో ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో, అకస్మాత్తుగా ఆ మాజీ సహోద్యోగి ఆమెను సంప్రదించి తన నిజస్వరూపాన్ని బయటపెట్టి బెదిరించడం మొదలుపెట్టాడు.
తన దగ్గర ఉన్న వీడియో కాల్ స్క్రీన్షాట్లను చూపించి, ప్రస్తుత భర్తకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ ఫోటోలను ఇంటర్నెట్లో పెట్టి, బంధువులకు పంపించి కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు.
దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ మహిళ, అతని బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ మహిళను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన సదరు మాజీ సహోద్యోగిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముమ్మర విచారణ జరుపుతున్నారు.

Leave a Reply