ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే తల తిరుగుతోంది. సామాన్యులు ఇది కేవలం పెళ్లిళ్ల సీజన్ ప్రభావం అనుకుంటారు, కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఒక ‘అదృశ్య యుద్ధం’. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది. చైనా తన ఖజానాలో 2303 టన్నుల బంగారాన్ని నిల్వ చేసుకోగా, భారత్ కూడా 880 టన్నుల బంగారంతో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు నిర్ణయాలు, అమెరికా డాలర్‌పై సడలుతున్న నమ్మకమే దీనికి ప్రధాన కారణం. కాగితపు నోట్ల (డాలర్ల) కంటే బంగారంపై ప్రపంచ దేశాలకు ఎందుకు నమ్మకం పెరుగుతుందో అర్థం చేసుకుందాం.
డాలర్ ప్రపంచ ‘డాన్’ గా ఎలా మారింది? 19వ శతాబ్దం వరకు ప్రపంచం ‘గోల్డ్ స్టాండర్డ్’పై నడిచేది. అంటే ఒక దేశం తన వద్ద ఉన్న బంగారు నిల్వలకు సమానంగా మాత్రమే నోట్లను ముద్రించగలదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని మూడింట రెండు వంతుల బంగారం అమెరికా వద్దకు చేరింది. 1944లో ‘బ్రెట్టన్ ఉడ్స్’ ఒప్పందం ప్రకారం, డాలర్ ప్రపంచ కరెన్సీగా మారింది.
నైక్సన్ షాక్ మరియు పెట్రో డాలర్: 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నైక్సన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. డాలర్లకు బదులుగా బంగారం ఇచ్చే నిబంధనను రద్దు చేశారు. దీనినే ‘నైక్సన్ షాక్’ అంటారు. అప్పుడు డాలర్ విలువ పడిపోకుండా ఉండటానికి 1974లో సౌదీ అరేబియాతో అమెరికా ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం సౌదీ తన చమురును కేవలం డాలర్లలోనే అమ్మాలి. ఇలా ‘పెట్రో డాలర్’ వ్యవస్థ పుట్టుకొచ్చింది.
ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాయి? 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను అమెరికా స్తంభింపజేసింది (Freeze). ఇది చూసి భారత్, చైనా వంటి దేశాలు షాక్ తిన్నాయి. రేపు అమెరికాతో మనకు విభేదాలు వస్తే, మన సొమ్మును కూడా అమెరికా ఇలాగే ఆయుధంగా వాడుకుంటుందని ప్రపంచ దేశాలకు అర్థమైంది. డొనాల్డ్ ట్రంప్ తాజాగా బ్రిక్స్ (BRICS) దేశాలకు ఇస్తున్న బెదిరింపులు ఈ భయాన్ని మరింత పెంచాయి.
అందుకే బంగారానికి పెరిగిన డిమాండ్: డాలర్ రూపంలో ఉన్న రిస్క్ తీసుకోలేక సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొంటున్నాయి:
- చైనా: 2000-2025 మధ్య తన బంగారు నిల్వలను 483% పెంచుకుంది.
- భారత్: 2005లో మన మొత్తం నిల్వల్లో బంగారం వాటా 4.3% ఉండగా, 2025 నాటికి అది 15%కి చేరింది.
- డాలర్ వాటా: ప్రపంచ నిల్వల్లో 2016లో 65% గా ఉన్న డాలర్ వాటా ఇప్పుడు 58%కి పడిపోయింది.
రష్యా-చైనాలు తమ 99% వ్యాపారాన్ని ఇప్పుడు స్థానిక కరెన్సీలోనే చేసుకుంటున్నాయి. డాలర్ ఆధిపత్యం అంత త్వరగా ముగియకపోయినా, దానికి సవాలు మాత్రం గట్టిగానే ఎదురవుతోంది.
