విషం రుచి ఎలా ఉంటుంది? అది చూడబోయి ప్రాణాలు కోల్పోయిన నలుగురు స్నేహితురాళ్లు; ప్రాణాలతో బయటపడిన బాలిక చెప్పిన భయంకర నిజం!

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో కేవలం “విషం రుచి” చూడాలనే కుతూహలంతో నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. దాఉద్‌నగర్ సబ్ డివిజన్‌లోని బిగహా గ్రామంలో జనవరి 29న జరిగిన ఈ వింత ఘటన ఆలస్యంగా ప్రపంచానికి తెలిసింది.

అసలేం జరిగింది? 12 నుండి 15 ఏళ్ల వయసు గల ఐదుగురు స్నేహితురాళ్లు కొంగలను చంపడానికి వాడే విషాన్ని రుచి చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నలుగురు బాలికలు విషం మింగి అక్కడికక్కడే మరణించగా, ఐదో బాలిక సమయస్ఫూర్తితో దానిని ఉమ్మేయడంతో ప్రాణాలతో బయటపడింది. మొదట్లో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు దాచిపెట్టి, నలుగురు మృతులకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. కానీ గ్రామంలో ప్రచారం జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

బ్రతికిన బాలిక సాక్ష్యం: పోలీసుల విచారణలో ఆ బాలిక చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. “ఒక స్నేహితురాలు మమ్మల్ని పొలానికి తీసుకెళ్లి ఒక పదార్థాన్ని చూపించి దీని రుచి ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పింది. దీనివల్ల చనిపోతామేమో అని మరొకరు భయపడితే.. ‘చూద్దాం, ఇది తింటే చనిపోతామో లేదో తెలుస్తుంది కదా’ అని రెచ్చగొట్టింది. అందరం కలిసి నీళ్లతో ఆ విషాన్ని మింగాము. మొదటి అమ్మాయి స్పృహతప్పి పడిపోగానే నేను భయపడి వెంటనే నోటిలోని విషాన్ని ఉమ్మేశాను. ఇంటికి పరుగెత్తి విషయం చెప్పగా, వారు నాకు వేప నీళ్లు తాగించి వాంతులు చేయించారు. కానీ వారు పొలానికి వెళ్లేసరికి మిగిలిన నలుగురు చనిపోయారు” అని వివరించింది.

పోలీసుల అనుమానం – ప్రేమ వ్యవహారం? కుటుంబ సభ్యులు ఇది కేవలం కుతూహలంతో జరిగిన పొరపాటు అని చెబుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం మరో కోణంలో విచారిస్తున్నారు. ఘటనకు ముందు రోజు ఆ బాలికలు కొంతమంది అబ్బాయిలతో కనిపించారని, ఆ విషయంలో కుటుంబ సభ్యులు వారిని మందలించారని సమాచారం. ఆ అవమానంతోనే వారు సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


Posted

in

by

Tags: