సామర్థ్యానికి మించి విపరీతమైన బరువును మోపడంతో, ఆ భారాన్ని మోయలేక ఒక ఎద్దు వీధిలో కుప్పకూలిపోయి వేదనతో విలవిలలాడుతున్న దిగ్భ్రాంతికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
నోరులేని ఆ జీవి నొప్పితో తలడిల్లుతున్నా, చుట్టూ ఉన్నవారు దానిని పట్టించుకోకుండా దాటుకుని వెళ్లిన దృశ్యం చూసేవారి గుండెలను పిండేస్తోంది.
ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు మరియు బరువులు మోసే పనుల్లో జంతువుల శారీరక సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, పరిమితికి మించి బరువులు వేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని నిరంతరం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో, మనుషుల నిర్దయను, జంతువులపై జరుగుతున్న క్రూరత్వాన్ని మరొకసారి ఎత్తిచూపుతోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఆ ఎద్దు అడుగు కూడా ముందుకు వేయలేక తీవ్రంగా శ్రమించి, చివరకు నేలపై కుప్పకూలిపోయింది. శారీరక అలసట, నొప్పితో అది పోరాడుతున్నప్పటికీ, దానిపై ఉన్న బరువును తగ్గించడానికి లేదా దానికి తగిన వైద్య సహాయం అందించడానికి అక్కడ ఉన్నవారు ముందుకు రాకపోవడం తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తోంది.
ఈ దారుణమైన దృశ్యాన్ని చూసిన జంతు హక్కుల కార్యకర్తలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువుల సామర్థ్యానికి మించి పనులు చేయిస్తూ వాటిని చిత్రహింసలకు గురిచేస్తున్న వ్యక్తులపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద పోలీసులు, సంబంధిత అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియో ఏ ప్రాంతంలో తీశారు, ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరు అనే దానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయినప్పటికీ, సంబంధిత అధికారులు తక్షణమే విచారణ జరిపి, నోరులేని మూగజీవులను ఈ విధంగా వేధించే వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలనేదే అందరి కోరిక.

Leave a Reply