హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని ప్రముఖ సుఖానీ మాత ఆలయ ప్రాంగణంలో నవరాత్రి ఉత్సవాల వేళ చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మొన్న రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో, గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆరు నెలల పసికందును చేతిలో ఎత్తుకుని ఆలయ ప్రాంగణానికి వచ్చాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, ఆ పసిబిడ్డను అత్యంత క్రూரంగా నేలపై బలంగా విసిరికొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
చిన్నారి ఏడుపు విని కంగారుగా బయటకు వచ్చిన ఆలయంలోని మహిళలు, ఆ పసికందు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు, విషమ స్థితిలో ఉన్న చిన్నారిని రక్షించి సెక్టార్-10 సివిల్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ అమానుష చర్య ఆలయ ప్రధాన ద్వారం వద్ద అమర్చిన సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. ఆ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బిడ్డను విసిరేసి వెళ్లిన ఆ వ్యక్తి ఎవరు? చిన్నారి అసలు తల్లిదండ్రులు ఎవరు? అనే కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తిస్తోంది.

Leave a Reply