ప్యాంగ్యాంగ్: ఎవరూ ఊహించని విధంగా వెనిజులాపై అమెరికా హఠాత్తుగా దాడులు జరిపింది. ఈ ఘటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. సరిగ్గా ఇదే సమయంలో ఉత్తర కొరియా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇది కొరియా ద్వీపకల్పంలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అసలు ఉత్తర కొరియా ఇలా ఎందుకు చేసింది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? వివరాల్లోకి వెళ్తే..
గత రెండు రోజులుగా వెనిజులాపై అమెరికా జరిపిన మెరుపు దాడి గురించే ప్రపంచమంతా చర్చించుకుంటోంది. అమెరికా వెనిజులాపై దాడి చేయడమే కాకుండా, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్యను అరెస్టు చేసి అమెరికాకు తరలించింది. ఈ గందరగోళం కొనసాగుతుండగానే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం.
ఉత్తర కొరియా ఏం చేసింది?
ఈ రోజు ఉదయం ఉత్తర కొరియా అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం ధృవీకరించింది. ఉత్తర కొరియా ఈ క్షిపణులను సముద్రం వైపు ప్రయోగించినప్పటికీ, ఇప్పటికే దక్షిణ కొరియా-ఉత్తర కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో ఈ చర్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.
ఉత్తర కొరియా రాజధాని ప్రాంతం నుండి ఉదయం 7:50 గంటలకు క్షిపణులు ప్రయోగించబడ్డాయని, అవి తూర్పు సముద్రం వైపు దూసుకెళ్లాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం తెలిపింది. అయితే ఈ క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా మరియు జపాన్‌తో పంచుకున్నామని, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని దక్షిణ కొరియా స్పష్టం చేసింది.
జపాన్ స్పందన
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది. అయితే ఈ ప్రయోగాల వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
క్షుణ్ణంగా గమనిస్తే.. అసలు కారణం ఇదేనా?
ఉత్తర కొరియాలో త్వరలోనే అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ మహాసభ (కాన్ఫరెన్స్) జరగనుంది. గత ఐదేళ్లలో ఇలాంటి సభ జరగడం ఇదే మొదటిసారి. ఈ సభకు ముందు ప్రపంచానికి తన సైనిక శక్తిని చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ క్షిపణి ప్రయోగాలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుత ప్రాముఖ్యత
అమెరికాతో ఉత్తర కొరియా చర్చలు గత కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాబోయే మహాసభలో కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. దక్షిణ కొరియా నిఘా వర్గాల ప్రకారం, ఈ సభ ఈ నెల లేదా వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది.
మరోవైపు, ఈ పరీక్షలు జరిగిన సమయం చాలా కీలకమైనది. ఒకవైపు శనివారం వెనిజులాపై అమెరికా దాడులు ప్రారంభించగా, మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర సమావేశం కోసం చైనాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఉత్తర కొరియా క్షిపణులతో కవ్వింపు చర్యలకు దిగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
