వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇంటి లోపల, బయట ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏసీలు, ఫ్యాన్లపై ఆధారపడుతుంటారు. దీనివల్ల కరెంటు బిల్లు భారీగా పెరుగుతుంది. అయితే, వేసవిలో కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా చల్లదనాన్ని పొందవచ్చని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం:
మనీ ప్లాంట్ (Money Plant): చాలా ఇళ్లలో మనీ ప్లాంట్లు సాధారణంగా కనిపిస్తుంటాయి. మట్టి అవసరం లేకుండా కేవలం నీరు నింపిన గ్లాసు సీసాలో కూడా వీటిని పెంచవచ్చు. ఇవి ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. వేసవిలో ఇంటి లోపల వేడిని తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
ఫిలోడెండ్రాన్ (Philodendron): హృదయాకారంలో ఆకర్షణీయమైన ఆకులతో ఉండే ఈ మొక్క మట్టి లేకుండానే పెరుగుతుంది. దీనికి తక్కువ వెలుతురు ఉంటే సరిపోతుంది. ఇంటిని చల్లగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
స్పైడర్ ప్లాంట్ (Spider Plant): ఇవి ఇంటి లోపల గాలిని శుద్ధి చేయడమే కాకుండా (Air Purification), వాతావరణాన్ని చల్లబరచడానికి కూడా తోడ్పడతాయి.
పీస్ లిల్లీ (Peace Lily): తెల్లటి పూలతో అందంగా ఉండే ఈ మొక్క ఇండోర్ ప్లాంట్‌గా చాలా బాగుంటుంది. ఇది నీటిలో కూడా పెరుగుతుంది. గాలిలో తేమను (Moisture) పెంచడం ద్వారా ఇంటిని చల్లగా ఉంచుతుంది.
టిల్లాన్సియా (Tillandsia): ఈ మొక్కకు కూడా మట్టి అవసరం లేదు. నీరు కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది. ఇవి ఇంటి వాతావరణాన్ని త్వరగా చల్లబరచడానికి సహాయపడతాయి.
