వైద్య లోకం తలవంచుకునే దారుణం: ఆశా కార్యకర్త నిర్వాకంతో పసికందు రెండు ముక్కలు!

బలవంతంగా లాగడంతో తెగిపోయిన శిశువు తల.. తల్లి గర్భంలోనే ఉండిపోయిన వైనం!

బస్తీ (ఉత్తర ప్రదేశ్): మానవత్వం మంటగలిసిపోయింది.. వైద్య సేవలందించాల్సిన చేతులే పసి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో వెలుగుచూసిన ఈ భీకర ఘటన వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక ఆశా కార్యకర్త అతి తెలివి, అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ఏడు నెలల పసికందు మొండెం ఒకచోట.. తల మరోచోట అన్నట్లుగా మారిపోయింది.

అసలేం జరిగిందంటే? ప్రేమా దేవి అనే ఏడు నెలల గర్భిణికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో కుద్రాహా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆసుపత్రికి చేరుకోవడానికి మరికొన్ని నిమిషాల సమయం ఉండగానే నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో అంబులెన్స్‌లో ఉన్న ఆశా కార్యకర్త, డాక్టర్ల కోసం వేచి చూడకుండా తానే వైద్యురాలిలా అవతారమెత్తింది.

మృగాల కంటే ఘోరంగా.. ఆ గర్భిణికి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చి, బలవంతంగా నార్మల్ డెలివరీ చేసేందుకు ఆశా కార్యకర్త ప్రయత్నించింది. ఈ క్రమంలో శిశువు శరీరం బయటకు వస్తుండగా, తల మాత్రం లోపలే చిక్కుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా ఆశా కార్యకర్త శిశువును బయటకు బలంగా లాగడంతో.. మెడ తెగిపోయి మొండెం చేతిలోకి వచ్చింది, తల తల్లి గర్భంలోనే ఉండిపోయింది!

నిజం దాచి ప్రాణాలతో చెలగాటం: తమ తప్పిదం వల్ల శిశువు ప్రాణం పోయిందని గుర్తించిన సిబ్బంది, ఆ నిజాన్ని దాచిపెట్టి.. మహిళ పరిస్థితి విషమంగా ఉందని నమ్మబలికారు. వెంటనే ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి జిల్లా మెడికల్ కాలేజీకి పంపారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసిన డాక్టర్లు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. తల్లి గర్భంలో మొండెం లేని తల ఉండటాన్ని గుర్తించి, తక్షణమే అత్యవసర సర్జరీ చేసి దానిని బయటకు తీశారు. ప్రస్తుతం తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతోంది.

చర్యలు శూన్యం – జనాగ్రహం: ఈ ఘోర కలికి కారణమైన ఆశా కార్యకర్త, అంబులెన్స్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇంత పెద్ద విపత్తు జరిగినా జిల్లా యంత్రాంగం ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. దేవుడిలా ప్రాణాలు కాపాడాల్సిన వారే ఇలా రాక్షసుల్లా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Posted

in

by

Tags: