సోషల్ మీడియా డెస్క్: ఆన్లైన్ మీటింగ్‌లు.. వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు ఒక్కోసారి నవ్వులు పూయిస్తే, మరికొన్ని సార్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే “నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అనే సామెత కచ్చితంగా గుర్తుకొస్తుంది. తన మేనేజర్‌పై ఓ ఉద్యోగి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
అసలేం జరిగింది?
ట్విట్టర్ (X) వేదికగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన ల్యాప్‌టాప్ ముందు ఆన్లైన్ మీటింగ్‌లో కూర్చుని ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక కుటుంబ సభ్యురాలు (భార్య అని నెటిజన్ల టాక్) “మళ్ళీ ఎందుకు ల్యాప్‌టాప్ తీశావు?” అని అడిగింది. దానికి ఆ వ్యక్తి విసుగ్గా, “నేనేం చేయను.. వీళ్ళు రాత్రి 7 గంటలకు మీటింగ్ పెట్టారు. అసలు వీడిని ఎవడు మేనేజర్ని చేశాడో ఏంటో!” అంటూ హిందీలో గట్టిగా అరిచాడు.
పాపం, ఆవేశంలో ఉన్న ఆ ఉద్యోగి తన మైక్రోఫోన్, కెమెరా రెండు ఆన్‌లో ఉన్నాయన్న సంగతి మర్చిపోయాడు. వెంటనే మరో ఉద్యోగి జోక్యం చేసుకుని, “బ్రదర్, నీ కెమెరా, మైక్ రెండూ ఆన్‌లో ఉన్నాయి” అని చెప్పడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురై “సారీ” అని చెప్పి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేశాడు.
నెటిజన్ల రియాక్షన్: నవ్వులు.. అనుమానాలు!
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దాదాపు 6 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియో కింద వస్తున్న కామెంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి:
- “అతని కెరీర్‌కు బ్రేక్ పడినట్టే!” అని ఒకరు కామెంట్ చేయగా..
- “సారీ చెప్పి సైడ్ అయిపోవడంలో ఇతడే బ్రాండ్ అంబాసిడర్” అని మరొకరు చలోక్తులు విసిరారు.
- “పాపం.. ఆ మేనేజర్ అప్పటికే పీఐపీ (PIP) లెటర్ టైప్ చేస్తూ ఉండొచ్చు” అంటూ కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మరికొందరు మాత్రం ఇది చూస్తుంటే “స్క్రిప్టెడ్” (ముందే ప్లాన్ చేసినట్టు) అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్ డ్రామాను హైలైట్ చేయడానికి ఎవరో కావాలనే ఇలా చేసి ఉండొచ్చని నెటిజన్ల అభిప్రాయం.
సూచన: ఆన్లైన్ మీటింగ్‌లో చేరే ముందు మైక్ ఆఫ్‌లో ఉందో లేదో చూసుకోవడం ఉత్తమం.. లేదంటే ఇలాగే “కెరీర్” రిస్క్‌లో పడే ప్రమాదం ఉంది!
