విద్యుత్తు ప్రవహించాలంటే వైర్లు లేదా కేబుళ్లు ఉండాలని మనం చిన్నప్పటి నుండి చదువుకున్నాం. బల్బులు, ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నీ వైర్ల ద్వారానే పనిచేస్తాయి. ఈ కాలంలో మనం వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్‌ను చూశాం కానీ, అంతకు మించి ఏమీ లేదు. అయితే గాలిలో విద్యుత్తును ప్రవహింపజేయడం సాధ్యమేనా? అంటే, అది నిజమేనని ఫిన్లాండ్ నిరూపించింది.
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశమైన ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు, వైర్లు మరియు ప్లగ్ పాయింట్ల అవసరం లేకుండా గాలి ద్వారా విద్యుత్తును పంపి కొత్త చరిత్ర సృష్టించారు.
ఇది ఎలా సాధ్యమైంది? హెల్సింకి యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రకారం, వారు ఈ ప్రయోగం కోసం హై-ఇంటెన్సిటీ సౌండ్ వేవ్స్ (శబ్ద తరంగాలు) మరియు లేజర్లను అనుసంధానించారు. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్, లేజర్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీల మిశ్రమాన్ని ఉపయోగించి తీగలు లేకుండానే విద్యుత్తును ఒక చోటు నుండి మరోచోటుకు పంపారు.
అల్ట్రాసోనిక్ బీమ్ మరియు లేజర్ సాంకేతికత:
- అకౌస్టిక్ వైర్: ఇది విద్యుత్తు ప్రవహించడానికి గాలిలో అదృశ్య మార్గాలను నిర్మిస్తుంది. అధిక తీవ్రత కలిగిన అల్ట్రాసోనిక్ తరంగాలు గాలి సాంద్రతను మార్చి, విద్యుత్ స్పార్క్స్ (Sparks) సురక్షితంగా ప్రయాణించేలా చేస్తాయి.
- పవర్-బై-లైట్: లేజర్లు దూరంగా ఉన్న రిసీవర్లకు శక్తిని పంపుతాయి.
- రేడియో ఫ్రీక్వెన్సీ హార్వెస్టింగ్: ఇది చుట్టుపక్కల ఉన్న తరంగాలను విద్యుత్తుగా మారుస్తుంది.
ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా, ఇంట్లోని స్మార్ట్ పరికరాలన్నింటినీ వైర్లు లేకుండానే ఛార్జ్ చేయడం లేదా నడపడం సాధ్యమవుతుంది.
