బీహార్లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, తన అసాధారణ ప్రతిభతో నేడు యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
కనీసం పదో తరగతి కూడా పూర్తి చేయని ఈ కుర్రాడి ఆటతీరు చూసి.. తన యార్కర్లతో ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లనే వణికించిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం వకార్ యూనిస్ సైతం ఆశ్చర్యపోయి ప్రశంసల వర్షం కురిపించాడు.
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్టైల్ తనకు సచిన్ టెండూల్కర్ ప్రారంభ రోజులను గుర్తుచేస్తోందని వకార్ యూనిస్ కితాబివ్వడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆనందాన్ని, ఉద్వేగాన్ని నింపుతోంది.
మనమంతా వీధుల్లో బ్యాట్ పట్టుకుని ఆడుకునే వయసులో.. షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ లాంటి అత్యంత వేగవంతమైన బౌలర్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ఈ కుర్రాడి ప్రతిభను చూసి ప్రత్యర్థి దేశాల ఆటగాళ్లు సైతం విస్మయం చెందుతున్నారు.
అదే సమయంలో, ఇంత చిన్న వయసులోనే ఆ పిల్లాడిపై భారీ అంచనాల భారం మోపకుండా, అతడిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి అంటూ వకార్ యూనిస్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్నాయి.
