పులి, సింహం లేదా పాము వంటివి దాడి చేస్తేనే మనిషి ప్రాణాలు పోతాయని చాలామంది భావిస్తారు. అంటే, ఆ జంతువులు మనల్ని నేరుగా తాకితేనో లేదా కరిస్తేనో ప్రమాదమని అనుకుంటారు. కానీ, మిమ్మల్ని తాకకుండానే మీ మరణానికి కారణమయ్యే కొన్ని జీవులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దోమలు దోమ అనేది చాలా చిన్న జీవి అయినప్పటికీ, భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఇది ఒకటి. దోమ కుట్టడం వల్ల మాత్రమే సమస్య రాదు; ఇవి భయంకరమైన వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. మలేరియా, డెంగ్యూ, జికా, చికెన్‌గున్యా వంటి వ్యాధులను ఇవి వ్యాపింపజేస్తాయి. దోమ మిమ్మల్ని నేరుగా చంపకపోయినా, అది వదిలే వైరస్ మనిషిని మరణానికి దారితీసేలా చేస్తుంది.
పఫర్ ఫిష్ (Pufferfish) ప్రమాదం ఎదురైనప్పుడు తన శరీరాన్ని బెలూన్లా ఉబ్బించే ఈ పఫర్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవులలో ఒకటి. దీని అంతర్గత అవయవాలలో ఉండే ‘టెట్రోడోటాక్సిన్’ అనే విషం, సైనైడ్ కంటే 1200 రెట్లు శక్తివంతమైనది. ఈ చేపను సరిగ్గా వండకుండా తింటే, ఆ విషం వల్ల పక్షవాతం, శ్వాసకోస సమస్యలు, గుండె వైఫల్యం సంభవిస్తాయి. జపాన్‌లో ‘ఫుగు’ అని పిలిచే ఈ చేప వంటకాలను తయారు చేయడానికి ప్రత్యేక లైసెన్స్ ఉన్న చెఫ్‌లు మాత్రమే అర్హులు.
బంగారు విషపు కప్ప (Golden Poison Frog) కొలంబియా వర్షారణ్యాలలో కనిపించే ఈ కప్ప ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది. దీని చర్మంపై ఉండే ‘బాట్రాచోటాక్సిన్’ అనే విషం ఎంత శక్తివంతమైనదంటే, ఒక చిన్న మోతాదుతోనే మనిషి చనిపోవచ్చు. దీనిని తాకాల్సిన అవసరం లేదు; గాలిలో లేదా మన శరీరానికి ఉన్న చిన్న గాయాల ద్వారా ఈ విషం లోపలికి వెళ్తే క్షణాల్లో గుండె ఆగిపోతుంది. ‘లియోఫిస్ ఎపినెఫెలస్’ అనే పాము జాతికి మాత్రమే ఈ విషాన్ని తట్టుకునే శక్తి ఉంది.
ఉమ్మేసే పాములు (Spitting Cobras) చాలామంది పాము కరిస్తేనే విషం ఎక్కుతుందని అనుకుంటారు. కానీ, కొన్ని రకాల నాగుపాములు (Spitting Cobras) తమ విషాన్ని దూరం నుండే చిమ్ముతాయి. ఇవి నేరుగా మనిషి ముఖం లేదా కళ్లపైకి విషాన్ని ఉమ్మేస్తాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి, కళ్లు వాపు రావడం, కొన్నిసార్లు శాశ్వత అంధత్వం కలిగే ప్రమాదం ఉంది. అయితే, ఈ విషం కేవలం కళ్లపై పడటం వల్ల మరణం సంభవించదని, కానీ తీవ్రమైన గాయాలు అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
