హమీర్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్ హమీర్పూర్ జిల్లా రాత్ పట్టణంలో ఒక పెళ్లి శోభనం రాత్రి వరకు కూడా నిలవలేదు. పెళ్లయి అత్తారింటికి వచ్చిన నవవధువు, భర్తతో సంసార జీవితాన్ని ప్రారంభించడానికి నిరాకరించింది. విషయం కాస్తా పెరగడంతో ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
రాత్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. నిర్ణయించిన తేదీన బారాత్ (పెళ్లి ఊరేగింపు) వచ్చి, సంప్రదాయబద్ధంగా అన్ని క్రతువుల తర్వాత వివాహం ఘనంగా జరిగింది. వధువు అత్తారింటికి చేరుకుంది. కుటుంబంలో అంతా సంతోషకరమైన వాతావరణం నెలకొంది.
అయితే, శోభనం రాత్రి అసలు కథ మొదలైంది. భర్త గదిలోకి వెళ్లడానికి వధువు (మిథ్లేష్) నిరాకరించింది. ఈ వివాహం తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందని, తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని, “నేను వేరొకరి అమానత్ (సొత్తు)” అని తెగేసి చెప్పింది. తను ఎవరిని ప్రేమిస్తుందో, అతనితోనే జీవితాన్ని పంచుకుంటానని స్పష్టం చేసింది. ఇది విన్న ఇరు కుటుంబాల వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆగ్రహించిన అత్తగారు – సోషల్ మీడియాలో వీడియో
కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఈ క్రమంలో ఆగ్రహం కట్టలు తెంచుకున్న అత్తగారు, కోడలిని చితకబాదింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో అత్తగారు కోడలికి వరుసగా చెంపదెబ్బలు కొడుతూ కనిపించింది.
పోలీసుల సమక్షంలో రాజీ
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు ఇరు పక్షాలతో విడివిడిగానే మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చివరకు భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కోటవాలి ఇన్ఛార్జ్ మాట్లాడుతూ.. ఇరు పక్షాల నుంచి ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, కుటుంబాల మధ్య రాజీ కుదరడంతో వివాదం సద్దుమణిగిందని తెలిపారు.
