మనేసర్‌లో వెలుగుచూసిన ఒక పరువు హత్య కేసు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తమ కులానికి చెందని వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోందన్న కోపంతో, 19 ఏళ్ల యువతిపై ఆమె అన్నయ్యే అత్యాచారం చేయించి, హత్య చేయించాడని పోలీసులు వెల్లడించారు. ఈ క్రూరమైన నేరానికి పథకం రచించిన అన్నయ్యతో పాటు, దానికి సహకరించిన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కుటుంబం వ్యతిరేకించిన ప్రేమ వ్యవహారం పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని ఎటా, ఆగ్రా ప్రాంతాలకు చెందిన ఈ అన్నాచెల్లెళ్లు గత ఆరేళ్లుగా మనేసర్‌లో నివసిస్తున్నారు. చెల్లెలు వేరే సామాజిక వర్గానికి చెందిన 24 ఏళ్ల యువకుడిని ప్రేమిస్తోందని, అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందని అన్న (28) తెలుసుకున్నాడు. దీంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.
నవంబర్ 15న ఆమెను బలవంతంగా యూపీలోని తమ సొంత ఊరికి పంపించాడు. అయితే, ఆమె నవంబర్ 22న తిరిగి మనేసర్‌కు చేరుకుని, మళ్ళీ తన ప్రియుడితో కలిసి నివసించడం మొదలుపెట్టింది. ఇది అన్నయ్యకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
కుతంత్రంతో ఆకర్షించి.. సహాయక పోలీస్ కమిషనర్ (మనేసర్) వీరేంద్ర సైనీ తెలిపిన వివరాల ప్రకారం.. తన చెల్లెలిని వదిలించుకోవాలని అన్న పథకం వేశాడు. ఇందులో భాగంగా తన 30 ఏళ్ల స్నేహితుడి సహాయం కోరాడు. ఆ స్నేహితుడు యువతిని కలిసి, ఆమెకు ప్రియుడితో పెళ్లి చేస్తానని, అందుకు ఊరు విడిచి రావాలని నమ్మబలికాడు.
ఆ మాటలను నమ్మిన యువతి డిసెంబర్ 10వ తేదీ రాత్రి రాంపూర్ చౌక్ వద్ద అతడిని కలిసింది. అక్కడి నుండి ఆమెకు సహాయం చేసే నెపంతో మనేసర్ వెలుపలకు తీసుకెళ్లారు.
గ్వాలియర్‌లో దారుణం నిందితులు యువతిని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ స్నేహితుడు ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆమె ప్రతిఘటించడంతో, ఆమెపై భౌతిక దాడి చేసి, చివరకు ఆమె స్కార్ఫ్తోనే గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఒక పొలంలోని శిథిలాల కింద పాతిపెట్టారు.
నేరం జరిగిన తర్వాత నిందితులిద్దరూ పరారయ్యారు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, అన్నయ్యే స్వయంగా తన చెల్లెలి ప్రియుడిపై నిందలు వేస్తూ నాటకమాడాడు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
