రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న యువతిపై, ఆమె సహోద్యోగులే కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సహకరించిన వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉండటం గమనార్హం.
అసలేం జరిగింది? డిసెంబర్ 20న ఉదయపూర్‌లోని ఒక హోటల్లో సదరు ఐటీ కంపెనీ CEO పుట్టినరోజు మరియు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ పార్టీకి కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న బాధితురాలిని కూడా ఆహ్వానించారు. పార్టీలో అందరూ కలిసి మద్యం సేవించారు. మద్యం తాగిన తర్వాత బాధితురాలు అనారోగ్యానికి గురైంది.
మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకుని: బాధితురాలు అస్వస్థతకు గురవడంతో, ఆమెను ఇంటి దగ్గర దించుతామని చెప్పి నిందితులు తమ కారులో ఎక్కించుకున్నారు. కారులో కంపెనీ CEO, ఒక మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ మరియు ఆమె భర్త ఉన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మార్గమధ్యంలో ఆమెకు సిగరెట్ ద్వారా మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత నిందితులు కదులుతున్న కారులోనే ఆమెపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు.
నిందితుల అరెస్ట్: మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన బాధితురాలు, తనపై అఘాయిత్యం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఉదయపూర్ ఎస్పీ యోగేష్ యాదవ్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కంపెనీ CEO మరియు మరో మహిళా అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ రిపోర్టులు మరియు బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
