సిరియా: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తొలిసారిగా సిరియాలో పర్యటించారు.
అంతర్జాతీయ ఘర్షణలను ముగింపునకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో చర్చలు జరిపేందుకు డమాస్కస్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో, ఆయన బస చేసిన హోటల్ సమీపంలో మంగళవారం వరుసగా శక్తివంతమైన బాంబు పేలుళ్లు సంభవించడం తీవ్ర కలకలం రేపింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను లక్ష్యంగా చేసుకునే ఈ హత్యాయత్నం జరిగినట్లు భావిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో మేక్రాన్ అధ్యక్ష భవనంలో సిరియా అధ్యక్షుడితో చర్చల్లో ఉండటంతో, ఆయన ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. భద్రతా దళాలు రంగంలోకి దిగి అన్ని దారులను మూసివేశాయి. బాంబులను ఎలా అమర్చారు అనే కోణంలో సిరియా భద్రతా దళాలు విచారణ ప్రారంభించాయి.
అనేక ఏళ్ల అంతర్యుద్ధం తర్వాత సిరియా రాజకీయ పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఇటువంటి కీలక సమయంలో, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన మేక్రాన్ పర్యటనలో జరిగిన ఈ దాడి అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అలాగే, ఈ బాంబు పేలుళ్లలో ఎవరైనా మరణించారా లేదా గాయపడ్డారా అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.
