షాకింగ్: 5 లీటర్ల కెపాసిటీ ఉన్న స్కూటర్ ట్యాంకులో 6.21 లీటర్ల పెట్రోల్! బంకు యజమాని నిర్వాకం

కేరళలోని పిరవం సమీపంలోని ఒక కొత్త పెట్రోల్ బంకులో విస్తుపోయే మోసం వెలుగులోకి వచ్చింది. 5 లీటర్ల పెట్రోల్ నిల్వ సామర్థ్యం మాత్రమే ఉన్న తన ద్విచక్ర వాహనానికి ఏకంగా 6.21 లీటర్ల పెట్రోల్ కొట్టినట్లు బిల్లు రావడంతో ఒక జర్నలిస్ట్ అవాక్కయ్యారు.

అసలేం జరిగిందంటే: వట్టప్పారకు చెందిన ఒక జర్నలిస్ట్ తన 2012 మోడల్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో ఇంధనం నింపుకోవడానికి కె.ఎం.పి జంక్షన్‌లోని కొత్త జియో పెట్రోల్ బంకుకు వెళ్లారు. ట్యాంకు ఫుల్ చేయమని చెప్పగా, మెషీన్‌లో 6.21 లీటర్లు వచ్చినట్లు చూపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ స్కూటర్ కంపెనీ ఇచ్చిన నిల్వ సామర్థ్యం కేవలం 5 లీటర్లు మాత్రమే. పైగా బంకుకు వెళ్లేటప్పటికే ట్యాంకులో సుమారు ఒక లీటర్ పెట్రోల్ ఉంది. లెక్క ప్రకారం ట్యాంకులో 7.21 లీటర్ల పెట్రోల్ ఉండాలి, కానీ అది అసాధ్యం.

యజమాని దురుసు ప్రవర్తన: మోసం జరిగిందని గుర్తించిన బాధితుడు తన స్నేహితుడితో కలిసి బంకు యజమానిని నిలదీశారు. “నా బండి కెపాసిటీ 5 లీటర్లు అయితే, 6.21 లీటర్లు ఎలా పడుతుంది?” అని అడగ్గా.. “ఆ విషయాలన్నీ వెళ్లి కంపెనీకి చెప్పుకో” అంటూ యజమాని దురుసుగా సమాధానమిచ్చారు. ట్యాంకులోని పెట్రోల్ కొలిచి చూపించమని కోరినప్పటికీ వినకుండా, వారి వాహనాల ఫోటోలు తీసి, బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు.

లీగల్ మెట్రాలజీకి ఫిర్యాదు: కొత్త బంకు కదా మంచి పెట్రోల్ దొరుకుతుందని వెళ్తే ఇలాంటి మోసం జరుగుతుందని ఊహించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొలతల్లో జరుగుతున్న ఈ భారీ దోపిడీపై బిల్లుతో సహా లీగల్ మెట్రాలజీ శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.


Posted

in

by

Tags: