బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిక్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్తలతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు మళ్ళీ బలపడే సంకేతాలు కనిపిస్తుండగా, మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి రావడంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
మారుతున్న సమీకరణాలు: షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజేద్ జాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తమ పార్టీ (అవామీ లీగ్) త్వరలోనే తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ (BNP) తో చర్చలు జరపవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘జమాత్-ఎ-ఇస్లామీ’ పార్టీ ప్రభావాన్ని అడ్డుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు. జమాత్ వంటి పార్టీలు అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్లో ఉగ్రవాదం మళ్ళీ పెరిగే అవకాశం ఉందని వాజేద్ హెచ్చరించారు.
అవామీ లీగ్ పునరాగమనం: ఆగస్టు 2024లో జరిగిన తిరుగుబాటు తర్వాత అవామీ లీగ్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. అయితే తాజాగా ‘ఖుల్నా’ ప్రాంతంలో దగ్ధమైన అవామీ లీగ్ కార్యాలయాలను మళ్ళీ తెరిచారు. అవామీ లీగ్ నేతలు మెల్లగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నారు. చాలా మంది కీలక నేతలు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెపై బంగ్లాదేశ్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో ఆమెకు మరణశిక్ష కూడా పడింది. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి వెళ్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
