“సరదా మాటలు తెచ్చిన తంటా”. తమాషాకు పంపిన మెసేజ్‌తో నడిగగనంలో విమానంలో కలకలం. 10,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా అత్యవసర ల్యాండింగ్. అసలేం జరిగింది..?

అమెరికాలో లాస్ వెగాస్ నుంచి న్యూజెర్సీకి వెళుతున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో, ఓ ప్రయాణికుడు పంపిన మెసేజ్ కారణంగా తీవ్ర భద్రతా ఆందోళనలు, కలకలం రేగాయి.

విమానం 10,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా, డాంటే మిల్టన్ (25) అనే ప్రయాణికుడు తన సహోద్యోగికి పంపిన టెక్స్ట్ మెసేజ్‌లో విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు, కుప్పకూల్చబోతున్నట్లు (క్రాష్ చేస్తానని) పేర్కొన్నాడు. దీన్ని గమనించిన విమాన సిబ్బంది వెంటనే విమాన పైలట్లకు (క్రూ కి) సమాచారం అందించారు.

దీంతో, భద్రతా ప్రోటోకాల్‌ను దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని వెంటనే బయలుదేరిన లాస్ వెగాస్‌కే తిరిగి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అతను ఎటువంటి విధ్వంసానికి ప్లాన్ చేయలేదని, తన సహోద్యోగితో కేవలం సరదా కోసమే అలా మెసేజ్ పంపానని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ, విమాన ప్రయాణంలో ఇలాంటి పుకార్లు, ఉగ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు.

విమానాల్లో బాంబు లేదా హైజాక్ గురించి చేసే జోకులు, పుకార్లను భద్రతా సంస్థలు ఎప్పుడూ తీవ్రంగానే పరిగణిస్తాయి. గతంలో కూడా ఇలాంటి జోకుల కారణంగా విమాన ప్రయాణికులు అరెస్టయిన, అత్యవసర ల్యాండింగ్‌లు జరిగిన సంఘటనలు ఉన్నాయన్నది గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన అమెరికాలో పెద్ద చర్చకు దారితీయడంతో పాటు, విమాన ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.


Posted

in

by

Tags: