ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో, మట్టిని తవ్వుతుండగా సుమారు 1.2 కిలోల బరువైన భారీ బంగారు ముద్ద లభ్యమైంది.
మెటల్ డిటెక్టర్ సహాయంతో బంగారాన్ని వెతుకుతున్న ఒక వ్యక్తికి ఈ అరుదైన నిధి దొరికింది. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల నుంచి రూ. 1.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటన బంగారం అన్వేషకుల దృష్టిని తీవ్రంగా ఆకర్షించింది.
తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఆ వ్యక్తి, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన టిబూబురా (Tibooburra) సమీపంలోని మౌంట్ స్టువర్ట్ ప్రాంతంలో పలు రోజులుగా బంగారం కోసం అన్వేషిస్తున్నాడు. కానీ అతనికి దొరికిందల్లా పాత మేకులు, గుర్రపు నాడాలు, పాత తుపాకీ బుల్లెట్లు లాంటి పనికిరాని వస్తువులే. అయినప్పటికీ, అతను తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా అన్వేషణ కొనసాగించాడు.
ఆ సమయంలో మెటల్ డిటెక్టర్ మట్టిలో ఏదో లోహం ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చింది. మొదట అది ఏదైనా సాధారణ వస్తువు అయి ఉంటుందని భావించిన అతను, మట్టిని తవ్వి చూడగా.. ఓ చిన్న పసుపు రంగు చుక్క మెరుస్తుండటాన్ని గమనించాడు. మట్టిని మరింత తొలగించి చూడగా, క్వార్ట్జ్ రాతి ముక్కలతో కలిసిన బంగాళదుంప పరిమాణంలో ఉన్న బంగారు ముద్ద లభ్యమైంది. ఈ బంగారు ముద్దకు అతను ‘టిబూబురా స్పడ్’ (Tibooburra Spud) అని పేరు పెట్టాడు.
ఈ బంగారు ముద్ద మొత్తం బరువు సుమారు 1.218 కిలోలు. దీన్ని పరీక్షించగా అందులో దాదాపు 940 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు తేలింది. బంగారం మార్కెట్ ధర ఆధారంగా దీని విలువ సుమారు 1.5 లక్షల నుంచి 1.6 లక్షల అమెరికన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే, ఇది అరుదైన సహజ సిద్ధమైన బంగారు ముద్ద కావడంతో, ప్రైవేట్ కలెక్టర్లకు విక్రయిస్తే ఇంతకంటే ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
