పరీక్షా పత్రాలు దిద్దేటప్పుడు టీచర్లకు రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే, మరికొందరు తమ కష్టాలను ఏకరువు పెడుతూ ఉత్తరాలు రాస్తుంటారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. ఓ విద్యార్థి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏకంగా టీచర్‌కే లంచం ఆఫర్ చేశాడు!
అసలేం జరిగిందంటే? విజయపుర ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఆ పేపర్లో సమాధానాలకు బదులుగా తన లవ్ స్టోరీని రాశాడు సదరు ప్రేమికుడు. “సార్.. ప్లీజ్, నా లవ్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. నేను గనుక పరీక్ష పాస్ అయితేనే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తానని చెప్పింది. మీ కాళ్లు మొక్కుతాను సార్.. నన్ను పాస్ చేయండి” అంటూ బతిమాలాడు.
చాయ్ తాగండి సార్.. కేవలం అభ్యర్థించడంతోనే ఆగకుండా, పేపర్ దిద్దే సార్‌కి లేదా మేడమ్‌కి ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు. ఆన్సర్ షీట్‌తో పాటు ఒక 500 రూపాయల నోటును పిన్ చేసి.. “ఈ 500 ఉంచుకుని టీ తాగండి సార్, కానీ నన్ను మాత్రం పాస్ చేయండి” అని విన్నవించుకున్నాడు. తన ప్రేమ కథ సుఖాంతం కావాలంటే ఆ పాస్ మార్కులే కీలకమని ఆ లేఖలో పేర్కొన్నాడు.
నెటిజన్ల కామెంట్స్ వర్షం: ఈ ఫోటో ‘vijayapur_le_dosta’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
- “పాపం.. ఆ పిల్లాడిని పాస్ చేయండి సార్, ఒక ప్రేమ జంటను కలిపిన పుణ్యం దక్కుతుంది” అని కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే..
- “ప్రేమ కోసం ఇంత రిస్క్ అవసరమా నాయనా!” అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.
మొత్తానికి చదువు కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, టీచర్‌కే చాయ్ ఖర్చుల కింద లంచం ఇవ్వజూపిన ఈ ‘ప్రేమ విన్యాసం’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
