కొల్లాం: పెళ్లి పేరుతో మోసాలు, నకిలీ వ్యాపార పెట్టుబడుల నెపంతో కేరళ వ్యాప్తంగా కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్న గజదొంగ దంపతులను పూయపల్లి పోలీసులు ఎట్టకేలకు చిక్కముట్టారు. చెట్టికులంగర నివాసి బిజు బాలన్, అతని భార్య రష్మీ బిజులను ఎర్నాకుళం సమీపంలోని మరాడ్‌లో ఉన్న వారి రహస్య స్థావరంపై దాడి చేసి అరెస్ట్ చేశారు.
మోసాల తీరు ఇలా: ఈ దంపతుల మోసాలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం సాగుతాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నకిలీ కంపెనీలు సృష్టించి, భారీగా సరుకులు కొనుగోలు చేసి, వాటిని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసి కంపెనీలకు బోర్డు తిప్పేయడం వీరి ప్రధాన వృత్తి.
- విదేశీ ఉద్యోగాల పేరుతో: ఆస్ట్రేలియా పౌరసత్వం, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓయూర్ నివాసి నుండి రూ. 10.5 లక్షలు వసూలు చేసిన కేసులో ప్రస్తుతం వీరిపై చర్యలు తీసుకున్నారు.
- పెళ్లి పేరుతో వంచన: ఒంటరి మహిళలతో స్నేహం చేసి, పెళ్లి చేసుకుంటామని నమ్మించి వారి వద్ద నుండి భారీగా డబ్బులు లాగేస్తారు. కోజికోడ్‌కు చెందిన ఒక మహిళ వద్ద నుండి ఏకంగా రూ. 85 లక్షలు, మరో యువతి వద్ద నుండి రూ. 15 లక్షలు ఇలాగే కొట్టేశారు.
- మెస్ వ్యాపారం: ఖతార్ వరల్డ్ కప్ సమయంలో మెస్ నడుపుదామని నమ్మించి కాయంకులంలో ఒక వ్యక్తి వద్ద నుండి రూ. 40 లక్షలు దోచుకున్నారు.
పోలీసులనే భయపెట్టే వింత ఎత్తుగడ: ఈ దంపతుల అసలు తెలివితేటలు ఎక్కడ ఉన్నాయంటే.. ఎవరైనా తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తెలిస్తే, వీరు తమ సొంత శరీరాన్ని బ్లేడ్లతో కోసుకుని గాయాలు చేసుకుంటారు. అనంతరం ఫిర్యాదు చేసిన వారే తమపై దాడి చేశారంటూ పోలీసులకు అబద్ధపు ఫిర్యాదులు ఇచ్చి కేసు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
బాధితుల సంఖ్య వెయ్యికి పైనే? ఈ కిలేడీ దంపతులు సుమారు రూ. 10 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరి అరెస్ట్ వార్త తెలియగానే మరికొంతమంది బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. క్రైమ్ బ్రాంచ్ సహా పలు ఏజెన్సీలు వీరిపై దర్యాప్తును ముమ్మరం చేశాయి.
