కాలిఫోర్నియాలోని ఒక ప్రసిద్ధ ఫిట్‌నెస్ క్లబ్ మరియు దాని చైల్డ్ కేర్ సెంటర్‌లో (డేకేర్), రెండేళ్లు కూడా నిండని ఒక చిన్నారిని అక్కడి మహిళా ఉద్యోగి ఒకరు క్రూరంగా విసిరికొట్టిన దృశ్యం సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డై తీవ్ర సంచలనం సృష్టించింది.
ఆ ఉద్యోగి, చిన్నారి చేతులను పట్టుకుని తన కాళ్ల మధ్య వేగంగా తిప్పుతూ, సుమారు 6 అడుగుల ఎత్తులో గాలిలోకి విసిరేశారు. అప్పుడు పట్టు తప్పడంతో చిన్నారి తలకిందులుగా నేలపై పడి తీవ్ర గాయాలపాలై ఏడవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా, పట్టుతప్పిన ఆ ఉద్యోగి కూడా చిన్నారిపైనే పడిపోయారు.
ఈ అమానుష ఘటన వల్ల చిన్నారి మెదడుకు తీవ్ర గాయమైందని (Traumatic Brain Injury), వినికిడి లోపం ఏర్పడిందని పేర్కొంటూ, బాధితురాలి తల్లిదండ్రులు ‘ది బే క్లబ్ ఎల్ సెగుండో’ (The Bay Club El Segundo) సంస్థపై కోర్టులో కేసు వేశారు. ప్రమాదం జరిగినప్పుడు చిన్నారికి స్వల్ప గాయాలే అయ్యాయని అబద్ధం చెప్పి, నిజాలను దాచడానికి ఆ సెంటర్ ప్రయత్నించింది. అంతేకాకుండా, సరైన లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆ కేంద్రం నడుస్తోందని తల్లిదండ్రుల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. పిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిన చోటే ఇంతటి నిర్లక్ష్యం, మోసం జరగడం కాలిఫోర్నియాలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
