బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ మరియు ప్రయాణికుడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పబ్లిక్ స్థలాల్లో ఎలా ప్రవర్తించాలి మరియు ప్రజల్లో ‘సివిక్ సెన్స్’ (సామాజిక స్పృహ) లోపించడం వంటి అంశాలపై ఈ వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. తన జీవనోపాధి అయిన వాహనం యొక్క శుభ్రతను కాపాడుకోవడంలో డ్రైవర్ చూపిన నిబద్ధత అందరి దృష్టిని ఆకర్షించింది.
ఎక్స్ (ట్విట్టర్)లో ప్రచారమవుతున్న వీడియో ప్రకారం.. ప్రయాణికుడు ఆటో దిగే సమయంలో సీటును ఒకసారి పరీక్షించమని డ్రైవర్ కోరారు. బయటకు వచ్చిన ప్రయాణికుడు ఏదో మొక్కుబడిగా చేత్తో సీటును తట్టి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ సీటుపై చెత్త ఉండటాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే అతడిని వెనక్కి పిలిచి సీటును సరిగ్గా శుభ్రం చేయాలని ఖచ్చితంగా ఆదేశించారు. దీనికి ప్రయాణికుడు ఎదురు చెప్పకుండా, తిరిగి వచ్చి సీటును తుడిచి శుభ్రం చేసిన తర్వాతే అక్కడి నుండి వెళ్లాడు.
“ప్రయాణికులు కేవలం ప్రయాణానికి మాత్రమే ఛార్జీ చెల్లిస్తారు, అంతేకానీ వాహనాన్ని అపరిశుభ్రం చేయడానికి వారికి ఎటువంటి లైసెన్స్ ఉండదు” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేయబడింది. ఆటో రిక్షా అనేది ఆ డ్రైవర్ జీవనాధారమని, దానిని సంరక్షించుకునే పూర్తి హక్కు అతనికి ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. డ్రైవర్ చేసిన పని వందకు వంద శాతం సరైనదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది డ్రైవర్‌ను సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తన వాహనం శుభ్రంగా ఉండాలని కోరుకునే హక్కు డ్రైవర్‌కు ఉంటుందని, అతను చెప్పడంలో ఎటువంటి తప్పు లేదని అభిప్రాయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మర్యాదగా ప్రవర్తించడం తెలియని వారికి ఈ వీడియో ఒక బలమైన హెచ్చరిక అని పలువురు విమర్శిస్తున్నారు.
