సీబీఐ విచారణ ముగిశాక చిరునవ్వుతో బయటకు వచ్చిన విజయ్.. వెంటనే చెన్నైకి రిటర్న్!

ఢిల్లీ: ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణ ముగించుకుని నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ చిరునవ్వుతో బయటకు వచ్చారు.

నలుపు రంగు దుస్తులు ధరించిన విజయ్, తన కారు సన్‌రూఫ్ (Sunroof) గుండా బయటకు వచ్చి అక్కడ వేచి ఉన్న అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజే, విజయ్ తన విచారణను ముగించుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి బయలుదేరి చెన్నై చేరుకున్నారు.

ఏడు గంటల పాటు విచారణ: కరూర్ తొక్కిసలాట కేసులో భాగంగా విజయ్‌ను సీబీఐ అధికారులు మూడవ విడత విచారించారు. ఇందుకోసం మార్చి 14న చెన్నై నుండి ఢిల్లీ వెళ్లిన విజయ్, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. సాయంత్రం 5:30 గంటల వరకు అంటే సుమారు 7 గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. గత రెండు విచారణల్లో కోరిన డాక్యుమెంట్లను విజయ్ బృందం ఈసారి అధికారులకు సమర్పించింది.

నిజానికి విచారణ సోమవారం వరకు కొనసాగుతుందని భావించినప్పటికీ, నేటితోనే ప్రక్రియ ముగిసిందని అధికారులు వెల్లడించారు. దీంతో విజయ్ వెంటనే చెన్నైకి తిరుగు ప్రయాణమయ్యారు.

ఎన్నికల నగారా: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేడు ప్రకటించారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 30 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

విజయ్ సీబీఐ కార్యాలయం నుండి బయటకు వచ్చే సమయంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన టీవీకే కార్యకర్తలు “టీవీకే.. టీవీకే..” అంటూ నినాదాలతో హోరెత్తించారు. విచారణ ముగిసిన తరుణంలో విజయ్ చెన్నై చేరుకోవడంతో ఆయన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.


Posted

in

by

Tags: