సుఖ ప్రసవం అంటే ఎలా ఉంటుందో మీరు వినే ఉంటారు. కానీ అక్షరాల రూపంలో చదివి ఎప్పుడైనా కన్నీరు పెట్టుకున్నారా? ఇది చదవండి.. మనసు ద్రవిస్తుంది.
ముందుగా కుడి పక్క నడుము భాగంలో చురకత్తితో పొడిచినట్లు విపరీతమైన నొప్పి మొదలవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ వస్తూ, క్రమంగా పొత్తికడుపు వరకు వ్యాపిస్తుంది. అంటే లోపల ఉన్న బిడ్డ తాను ఈ లోకంలోకి వచ్చే సమయాన్ని నిర్ణయించుకుందని అర్థం.
కొత్త ప్రపంచాన్ని చూడాలని బిడ్డ నిర్ణయించుకున్నాక, ఇప్పటివరకు తానూ ఉన్న గర్భాశయ ప్రపంచంలోని జీవనాధారమైన ఉమ్మనీటి సంచిని (Amniotic sac) పగులగొడుతుంది. అక్కడే బిడ్డ శ్వాసిస్తూ, ఈదుతూ ఉంటుంది. అది పగిలిన తర్వాత కొత్త ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నప్పుడు ప్రసవ వేదన తారాస్థాయికి చేరుతుంది. (ఉమ్మనీరంతా బయటకు వచ్చేలోపే ఆసుపత్రికి చేరుకోవాలి). కడుపు మొత్తం విపరీతంగా నొప్పి పుడుతుంది, సరిగ్గా శ్వాస తీసుకోలేరు. ఆ సమయంలో ఆ మహిళకు కావాల్సిందల్లా తన భర్త చేతిని గట్టిగా పట్టుకోవడం మాత్రమే. మనసు వేరెవరినీ వెతకదు.. కేవలం భర్త తోడును మాత్రమే కోరుకుంటుంది.
ఆసుపత్రిలో మొదట ఎనిమా ఇచ్చి కడుపును శుభ్రం చేస్తారు. ఇప్పటికే ఉన్న నొప్పితో పాటు ఇది మరో నరకం. ఆపై కాళ్లు రెండూ వెడల్పుగా ఉంచమంటారు. అప్పటికే నొప్పి వెన్నెముకను తాకుతుంది. ఎలా అంటే.. ఒక కత్తిని తీసుకుని వెన్నెముక డిస్కుల మధ్యలో గుచ్చితే ఎంత నొప్పి ఉంటుందో అంతటి వేదన అది. ఒక నర్సు కడుపుపై ఒత్తిడి ఇస్తూ, బిడ్డను కిందకు నెట్టడానికి ప్రయత్నిస్తుంది.
డాక్టర్ గట్టిగా ముక్కమని చెబుతారు. కేవలం సిజేరియన్ (Operation) సమయంలోనే అనస్థీషియా (మత్తు) ఇచ్చి చేస్తారు, కానీ సుఖ ప్రసవంలో కూడా కుట్లు వేయాల్సి ఉంటుంది. యోని భాగం బిడ్డ తల బయటకు రావడానికి సరిపోనప్పుడు, అక్కడ ఒక చిన్న గాటు పెడతారు. ఆ సమయంలో ప్రాణం పోతుందన్నంత నొప్పి ఉంటుంది. కానీ డాక్టర్.. “అమ్మా, నీకు నొప్పి ఉన్నట్టే నీ బిడ్డకు కూడా నొప్పిగా ఉంటుంది, ఆ నొప్పి తగ్గాలంటే నువ్వు త్వరగా ముక్కి బిడ్డను బయటకు పంపాలి” అని చెప్పగానే, ఆ తల్లికి ఎక్కడ లేని శక్తి వస్తుంది. నరాలన్నీ బిగబట్టి, తన ఒంటిలోని శక్తిని అంతా కూడగట్టుకుని, యోని భాగం చీల్చుకుంటూ బిడ్డ బయటకు వచ్చేలా చేస్తుంది.
బిడ్డ పుట్టిన తర్వాత, ఆమెకు కొంచెం ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. తీరా నిట్టూర్పు విడిచేలోపే, డాక్టర్ అక్కడ పడిన గాటుకు కుట్లు వేయడం మొదలుపెడతారు. అది మలద్వారం పైభాగం వరకు చీలి ఉంటుంది. అప్పుడు కూడా చాలా సందర్భాల్లో మత్తు ఇవ్వరు. ఆ నరకం వర్ణనాతీతం. ఆ తర్వాత ఆమెను వార్డుకు తీసుకెళ్లి బిడ్డకు పాలు ఇవ్వమంటారు.
ఆ పసిగుడ్డుకు కళ్ళు కూడా తెరవలేవు, పాలు ఎలా తాగాలో కూడా తెలియదు. కానీ ఆకలితో ఏడుస్తుంటే చూడటానికి చాలా పాపంగా ఉంటుంది. కొంచెం పాలను తీసి నోట్లో వేసి, చెవిని నిమిరితే ఆ బిడ్డ పాలు తాగడం మొదలుపెడుతుంది. చెవిని నిమిరితే పాలు తాగాలని ఆ బిడ్డకు ఎలా తెలుస్తుందో ఇప్పటికీ అది ఒక అంతుచిక్కని అద్భుతం. తనలో నుండి పుట్టిన ఇంకో ప్రాణం తన ఆకలిని తన వద్దే తీర్చుకోవడం చూస్తుంటే, అప్పటివరకు పడిన శారీరక కష్టాలన్నీ మర్చిపోతుంది ఆ తల్లి.
ఇది చదువుతుంటేనే కళ్లు చెమర్చుతున్నాయా? మరి దీనిని అనుభవించే స్త్రీ పరిస్థితి ఏంటి? నిజానికి తల మీద పెట్టుకుని పూజించాల్సిన ప్రాణి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే. ఆమెను చివరి వరకు ఒక పసిబిడ్డలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
