సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఓటమి.. శివమ్ దూబేపై మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

మైకేల్ వాన్ విమర్శలు: 2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భాగంగా మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, చివరి ఓవర్‌ను పార్ట్-టైమ్ మీడియం పేసర్ శివమ్ దూబేకు ఇవ్వడాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పుబట్టారు.

254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్, 19 ఓవర్లకు 224/6 స్కోరు వద్ద నిలిచింది. చివరి ఓవర్‌లో ఆ జట్టుకు 30 పరుగులు అవసరమయ్యాయి. భారత్ విజయం సాధించినప్పటికీ, ఇంగ్లాండ్ ఓటమిని వాన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది.

దూబేకు చివరి ఓవర్ ఇవ్వడంపై ప్రశ్నలు అక్షర్ పటేల్ ఓవర్ మిగిలి ఉన్నప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్‌ను శివమ్ దూబేకు అప్పగించారు. ఈ నిర్ణయం చివరకు భారత్‌కు కలిసొచ్చింది. దూబే ఆ ఓవర్‌లో 22 పరుగులు ఇచ్చినప్పటికీ, భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అయితే, అది చాలా ఖరీదైన ఓవర్ అని చెప్పక తప్పదు.

‘మరో ఓవర్ వేసి ఉంటే…’ మ్యాచ్ అనంతరం ‘క్రిక్‌బజ్’లో ఈ నిర్ణయం గురించి మైకేల్ వాన్ మాట్లాడుతూ.. “భారత్ గెలిచింది, కానీ ఆ నిర్ణయంతో నేను ఏమాత్రం ఏకీభవించను. అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలర్, ఆయన యార్కర్లు వేయగలడు. శివమ్ దూబే తన గత 3 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు. ఒకవేళ ఆయన భారత్ తరపున మరో ఓవర్ వేసి ఉంటే, భారత్ ప్రపంచకప్‌ను కోల్పోయేది. ఒకవేళ ఆదివారం జరిగే ఫైనల్‌లో కూడా ఆయనతో బౌలింగ్ చేయించాల్సి వస్తే, భారత్ పరిస్థితి దారుణంగా ఉంటుంది” అని విమర్శించారు.

అక్షర్‌కే బౌలింగ్ ఇవ్వాల్సింది వాన్ ఇంకా మాట్లాడుతూ.. “క్రికెట్‌లో విషయాలను సరళంగా ఉంచాలి. అక్షర్ పటేల్ వంటి అనుభవజ్ఞుడు అందుబాటులో ఉన్నప్పుడు ఆయనకే అవకాశం ఇవ్వాలి. స్ట్రైక్‌లో లెఫ్ట్ హ్యాండర్ ఉన్న మాట నిజమే, కానీ అవతలి ఎండ్‌లో జేమీ ఓవర్టన్ ఉన్నాడు. అనుభవం ఉన్న బౌలర్లపై నమ్మకం ఉంచాలి” అని అన్నారు. మరి న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ దూబేకు బౌలింగ్ ఇస్తారో లేదో చూడాలి.


Posted

in

by

Tags: