సెల్ఫీలకు నో.. చూయింగ్‌గమ్ నమలకూడదు! సింగపూర్, శ్రీలంక సహా వివిధ దేశాల్లోని వింత చట్టాలు ఇవే!

మనం దైనందిన జీవితంలో చాలా సాధారణంగా చేసే కొన్ని అలవాట్లు, కొన్ని దేశాల్లో మిమ్మల్ని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయని మీకు తెలుసా? అవును, ఇది నిజం.. మనం చాలా సాధారణమైన విషయాలుగా భావించే వాటిపై కూడా కొన్ని దేశాలలో నిషేధాలు ఉన్నాయి. కేవలం నిషేధించడమే కాదు.. ఆ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు, శిక్షలు కూడా విధిస్తారు.

ఇలాంటి వింత చట్టాలు అనగానే ఉత్తర కొరియా గురించే చెబుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి ఆ దేశం ఈ లిస్ట్‌లో లేదు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇలాంటి వింతైన చట్ట నిబంధనలను పాటిస్తున్నారు. వాటి గురించి తెలియకుండా ఆయా దేశాల్లో అడుగుపెడితే ముక్కుపిండి జరిమానా వసూలు చేస్తారు. ఈ జాబితాలో భారతదేశ పొరుగు దేశమైన శ్రీలంకతో పాటు సింగపూర్ కూడా ఉన్నాయి. ఆ వింత రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

చూయింగ్‌గమ్‌లపై నిషేధం:
ఆసియా ఖండంలోని ప్రముఖ దేశాలలో ఒకటైన సింగపూర్‌లో “చూయింగ్‌గమ్” నమలడంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ప్రజలు చూయింగ్‌గమ్‌లు నమిలి పడిపోయిన ప్రతిచోటా అంటించడం వల్ల బహిరంగ ప్రదేశాలు అపరిశుభ్రంగా మారుతున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మెట్రో రైలు తలుపులు, లిఫ్ట్‌లు, ఇతర ప్రజా మౌలిక వసతులపై చూయింగ్‌గమ్‌లను అంటించడం వల్ల అవి పాడవుతున్నాయి.

దీంతో 1992లో సింగపూర్ ప్రభుత్వం చూయింగ్‌గమ్‌ల విక్రయంపై కఠినమైన ఆంక్షలు విధించింది. అయితే, వైద్య అవసరాల కోసం ఉపయోగించే కొన్ని రకాల థెరప్యూటిక్ (Therapeutic) చూయింగ్‌గమ్‌లకు మాత్రం కొన్ని షరతులతో అనుమతి ఇస్తారు. కానీ సాధారణ చూయింగ్‌గమ్‌ల అమ్మకాలు, పంపిణీపై ఇప్పటికీ అక్కడ పూర్తి నిషేధం కొనసాగుతోంది.

పావురాలకు మేత వేయకూడదు:
ఇటలీలోని వెనిస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక ‘సెయింట్ మార్క్స్ స్క్వేర్’ (St. Mark’s Square) పరిసరాల్లో పావురాలకు ఆహారం వేయడాన్ని అధికారులు నిషేధించారు. పారిశుద్ధ్య సమస్యలు, పురాతన కట్టడాలకు జరుగుతున్న నష్టంపై దీర్ఘకాలంగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పావురాల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల, వాటి విసర్జితాల (రొంపి) లోని రసాయనాలు శతాబ్దాల నాటి పురాతన కట్టడాలు, స్మారక చిహ్నాలను క్షీణింపజేస్తూ పాడుచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి పావురాలపై జాలి చూపి మేత వేస్తే.. అధికారులు మీపై జాలి చూపకుండా జేబులు ఖాళీ చేయిస్తారు.

బుద్ధుడి విగ్రహాల వద్ద సెల్ఫీలకు బ్రేక్:
భారతదేశ పొరుగు దేశమైన శ్రీలంకలో బుద్ధుడి విగ్రహాల వద్ద సెల్ఫీలు దిగితే కఠిన చర్యలు తీసుకుంటారు. మతపరమైన విషయాలలో శ్రీలంక చాలా కఠినమైన విధానాన్ని అనుసరిస్తుంది. ముఖ్యంగా బుద్ధుడి విగ్రహాల పక్కన నిలబడి అగౌరవంగా పోజులిస్తూ ఫోటోలు దిగడం, లేదా విగ్రహానికి వెనుక వైపు వీపు చూపిస్తూ సెల్ఫీలు తీసుకోవడం వంటి చర్యలను బుద్ధుడిని అవమానించడంగా పరిగణిస్తారు. అందుకే వీటికి అక్కడ పూర్తి నిషేధం ఉంది.

ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకు గతంలో కొందరు విదేశీ పర్యాటకులను అరెస్ట్ చేసి, దేశం నుండి బహిష్కరించిన (డీపోర్ట్ చేసిన) సంఘటనలు కూడా ఉన్నాయి. శ్రీలంకకు వెళ్లే పర్యాటకులు, అక్కడి మతపరమైన ప్రదేశాలను సందర్శించేటప్పుడు స్థానిక సంస్కృతిని, మతపరమైన భావాలను గౌరవించాలని అధికారులు ఖచ్చితంగా చెబుతున్నారు.

మిలిటరీ తరహా దుస్తులు నిషిద్ధం:
కరేబియన్ ప్రాంతంలోని బార్బడోస్, జమైకా వంటి కొన్ని దేశాలలో సాధారణ ప్రజలు ‘కామోఫ్లేజ్ ప్యాటర్న్’ (Camouflage Pattern) అంటే మిలిటరీ సైనికులు ధరించే రంగుల దుస్తులను ధరించడంపై నిషేధం ఉంది. సైనిక సిబ్బంది మాత్రమే వాటిని ధరించడానికి అనుమతి ఉన్నందున, సాధారణ ప్రజలు లేదా పర్యాటకులు అటువంటి దుస్తులు వాడితే చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లే పర్యాటకులు పొరపాటున కూడా అలాంటి దుస్తులు, షార్ట్స్ లేదా బ్యాగులను తీసుకెళ్లకూడదు. కొన్నిసార్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు పర్యాటకుల వద్ద ఉన్న కామోఫ్లేజ్ డిజైన్ దుస్తులను స్వాధీనం చేసుకుంటారు.

స్విట్జర్లాండ్:
భూలోక స్వర్గంగా పిలవబడే స్విట్జర్లాండ్‌ను సందర్శించడానికి పర్యాటకులు భారీగా ఆసక్తి చూపిస్తుంటారు. అత్యంత సంపన్న దేశంగా పేరొందిన స్విట్జర్లాండ్‌లో, రాత్రి వేళల్లో బాత్రూమ్ ఉపయోగించాలన్నా కొంచెం ఆలోచించాల్సిందేనట. అక్కడ రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్‌లో ఫ్లష్ (Flush) చేయడం చట్టవిరుద్ధమని ఇంటర్నెట్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే అది పూర్తిగా ప్రభుత్వ చట్టం కానప్పటికీ.. కొన్ని అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు రాత్రి వేళల్లో ఇతరుల నిద్రకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో అంతర్గతంగా ఇలాంటి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *