హర్దోయీ: ఉత్తరప్రదేశ్లోని హర్దోయీ జిల్లా నుండి అత్యంత హేయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అన్నదమ్ములు తమ సొంత చెల్లిపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఏం జరిగింది?
ఈ ఘటన హర్దోయీ జిల్లాలోని అర్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగింది. బాధితురాలికి ఒక అక్క, ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు. అందులో ఇద్దరు అన్నదమ్ములు గత ఏడాది కాలంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. సెప్టెంబర్ 18న కూడా ఒక సోదరుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడగా, బాధితురాలు ఆ దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీసింది. అప్పటికే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది.
బయటపడిన నిజం..
బాధిత యువతి తన కాబోయే భర్తకు జరిగిన దారుణాన్ని వివరించింది. ఆమెకు ధైర్యం చెప్పిన పెళ్లికొడుకు, ఆమెను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. బాధితురాలు తన వద్ద ఉన్న వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు వెంటనే స్పందించి నిందితులైన ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు.
పోలీసుల ప్రకటన..
ఈ ఘటనపై హర్పాల్పూర్ సిఓ సతేంద్ర సింగ్ మాట్లాడుతూ, “బాధితురాలు తన కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ అరెస్టు చేశాము. తదుపరి విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు. సొంత అన్నదమ్ములే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
