“స్కూల్‌ బస్సును అడ్డగించి మరీ ఇంత దారుణంగా కాల్పులా..!” 50 మంది విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టిన దుండగులు.. అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ సమీపంలో సుమారు 50 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును నడిరోడ్డుపై అడ్డగించిన దుండగుల ముఠా, డ్రైవర్‌పై తుపాకీతో కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

బస్సులో ఉన్న చిన్నారులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కేకలు వేస్తున్నా ఏమాత్రం కనికరం లేకుండా రౌడీ మూక సాగించిన ఈ కాల్పుల ఉదంతం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.

గ్వాలియర్‌లోని టేకాన్‌పూర్ ప్రాంత సమీపంలో స్కూల్ బస్సు యథావిధిగా విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా, గుర్తుతెలియని దుండగులు బస్సును బలవంతంగా ఆపారు. డ్రైవర్‌తో ఉన్న పాత కక్షలు లేదా వివాదం కారణంగా, క్షణాల వ్యవధిలోనే ఆ ముఠా తుపాకీ తీసి నేరుగా డ్రైవర్‌పై కాల్పులు జరిపింది.

డ్రైవర్ రక్తపు మడుగులో కుప్పకూలిపోవడం, తుపాకీ మోతలతో బస్సులోని 50 మంది చిన్నారులు భయంతో వణికిపోతూ ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అనంతరం బస్సులోని పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి ఈ దాడితో సంబంధమున్న ముగ్గురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ బస్సుపైనే కాల్పులకు తెగబడిన ఈ ఘటన తల్లిదండ్రులలో, స్థానిక ప్రజలలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.


Posted

in

by

Tags: