స్కూలు విద్యార్థుల భద్రతపై నిరంతరం చర్చలు జరుగుతున్నప్పటికీ, మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
గురుకుల్ పబ్లిక్ స్కూల్ బస్సులో నుంచి దిగిన రెండో తరగతి విద్యార్థిని అభిజ్ఞా మాడివాలే, డ్రైవర్ బస్సును తప్పు దారిలో (రాంగ్ సైడ్) ఆపడంతో, రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బస్సులో ఉన్న టీచర్ కూడా ఆ చిన్నారిని సురక్షితంగా రోడ్డు దాటించకుండానే కిందకు దించేయడంతో, అటుగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఆ చిన్నారిని ఢీకొట్టింది.
ఈ దారుణ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పాఠశాల యాజమాన్యం మరియు సిబ్బంది యొక్క నిర్లక్ష్య వైఖరిపై పలువురు మండిపడుతున్నారు.
విద్యార్థుల భద్రతను చూడాల్సిన బస్సు డ్రైవర్లు మరియు టీచర్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది.
విద్యార్థులను బస్సులో ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి బాధ్యతారహితమైన స్కూల్ బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
