పాట్నా: రాజధాని పాట్నా నుండి అదృశ్యమైన మహిళా అధికారిణిని పోలీసులు ఛప్రాలో గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బార్-SDPO ఆనంద్ కుమార్ సింగ్ ఈ మేరకు కీలక సమాచారాన్ని అందించారు.
ఆనంద్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళా అధికారి తన స్నేహితురాలికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి వెళ్లారు. ఆమె స్నేహితురాలి పుట్టినరోజు కావడంతో, ఎవరికీ చెప్పకుండా వెళ్లినట్లు తేలింది. పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఆమెను సురక్షితంగా గుర్తించారు.
సదరు మహిళా అధికారిణిని విచారించగా, సారణ్ జిల్లా మష్రక్ నివాసి అయిన తన స్నేహితురాలు అంజలి కుమారి అలియాస్ గోల్డీ కుమారి పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లినట్లు చెప్పారు. తన మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని, అందుకే ఎవరికీ అందుబాటులోకి రాలేకపోయానని ఆమె వివరించారు.
మహిళా అధికారి ఫోన్ లొకేషన్ ఆధారంగా 24 గంటల్లోనే ఆమెను ట్రేస్ చేసినట్లు SDPO తెలిపారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఆమె ఒక యువకుడితో కలిసి వెళ్లినట్లు వచ్చిన వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. అటువంటి వార్తల్లో నిజం లేదని వారు స్పష్టం చేశారు.
23 రోజుల క్రితమే వివాహం: అత్మల్గోలా బ్లాక్లో బిటిఎమ్ (BTM) హోదాలో పనిచేస్తున్న అర్యామా దీప్తి గత శుక్రవారం నుండి కనిపించకుండా పోయారు. దీప్తికి కేవలం 23 రోజుల క్రితమే పాట్నాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) శుభమ్తో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత దంపతులిద్దరూ నేపాల్ పర్యటనకు వెళ్లి వచ్చారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీప్తి భక్తియార్పూర్లో విధుల్లో చేరారు. ఆమె భక్తియార్పూర్ జంక్షన్ సమీపంలో ఒక అద్దె గదిలో ఉంటూ తన సేవలను అందిస్తున్నారు.
