‘స్పెయిన్‌లో 8 నెలలు వేచి చూడాలి, కేరళలో పది నిమిషాలు కూడా పట్టలేదు’; ప్రభుత్వ ఆసుపత్రి సేవలను మెచ్చుకున్న విదేశీయురాలు

కేరళలోని ఆరోగ్య రంగాన్ని ప్రశంసిస్తూ స్పెయిన్‌కు చెందిన సోలో ట్రావెలర్ వెరోనికా ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆలప్పుళలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తనకు ఎదురైన అనుభవం గురించి ఆమె ఈ వీడియోలో వివరించారు.

వెరోనికా మాటల్లో..: “నిజానికి ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇంత వేగంగా పనిచేస్తుందని నేనస్సలు ఊహించలేదు. భారతదేశం అంతటా ఇలాగే ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, మా దేశమైన స్పెయిన్‌లో ఒక డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధి నిపుణుడు)ని కలవాలంటే దాదాపు ఎనిమిది నెలలు వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆసుపత్రికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. నేను కేవలం పది నిమిషాల లోపే డాక్టర్‌ని కలవగలిగాను. అది కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కావడం నాకు ఆశ్చర్యం కలిగించింది” అని వెరోనికా పేర్కొన్నారు.

వైరల్ అయిన వీడియో: ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. కేరళలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఇలాంటి నాణ్యమైన సేవలను దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆశించలేమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వెరోనికా గత కొంతకాలంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.


Posted

in

by

Tags: