కట్న వేధింపుల ఆరోపణలు రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపాయి. శుక్రవారం రాత్రి నాగ్‌పూర్‌లోని సోనేగావ్ ప్రాంతంలో ఉన్న ‘హోటల్ రాయల్ విల్లా’లో 30 ఏళ్ల యువకుడు మరియు అతని 60 ఏళ్ల తల్లి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో కుమారుడు సూరజ్ శివన్న అక్కడికక్కడే మృతి చెందగా, అతని తల్లి జయంతి రామకృష్ణప్ప ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మొత్తం ఘటన బెంగళూరుతో ముడిపడి ఉంది.
ఏం జరిగిందంటే?
సూరజ్‌కు గానవితో ఒకటిన్నర నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే బెంగళూరులో గానవి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తర్వాత మృతురాలి కుటుంబ సభ్యులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, అదనపు కట్నం కోసం వేధించడమే ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. ఈ ఆరోపణలతో మనస్తాపం చెందిన సూరజ్ మరియు అతని తల్లి నాగ్‌పూర్‌కు వచ్చారు. అక్కడ హోటల్ రాయల్ విల్లాలో గది తీసుకుని, అర్ధరాత్రి ఇద్దరూ ఉరివేసుకున్నారు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని సూరజ్ మృతదేహాన్ని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. జయంతి ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఆమె పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హనీమూన్ మధ్యలోనే నిలిపివేత
సూరజ్, గానవి హనీమూన్ కోసం శ్రీలంకకు వెళ్లారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, వారు పర్యటనను మధ్యలోనే ముగించుకుని బెంగళూరు తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే గానవి ఆత్మహత్యకు పాల్పడింది. సూరజ్, అతని తల్లి మరియు సోదరుడిపై కట్న వేధింపుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది. మహిళలపై పెరుగుతున్న హింస పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
తండ్రి ఆరోపణలు – పోలీసుల వాదన
గానవి తండ్రి శశి ఆరోపణల ప్రకారం.. ఎంతో ఘనంగా పెళ్లి చేసినప్పటికీ, సూరజ్ మరియు అతని తల్లి జయంతి అదనపు కట్నం కోసం గానవిని వేధించేవారు. దీనిపై రామమూర్తి నగర్ పోలీసులు కట్న వేధింపులు మరియు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసులు నమోదు చేశారు.
మరోవైపు, సోనేగావ్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. “ఈ కేసుపై లోతైన విచారణ జరుగుతోంది. సూసైడ్ నోట్ లేదా ఇతర ఆధారాల కోసం బెంగళూరు పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నాం” అని తెలిపారు. అయితే, సూరజ్ కుటుంబం కట్నం అడగలేదని, కేవలం కుటుంబ కలహాల వల్లే గొడవలు పెరిగాయని కొన్ని పోలీసు వర్గాలు ప్రాథమికంగా భావిస్తున్నాయి.
