‘హాదీ హత్యలో పాల్గొన్న ఇద్దరు నిందితులు భారత్‌కు పారిపోయారు’ – బంగ్లాదేశ్ హింసపై ఢాకా పోలీసుల సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మరోసారి హింసాకాండతో అట్టుడుకుతోంది. గత వారం బంగ్లాదేశ్‌లో ఇద్దరు విద్యార్థి నేతలు కాల్చి చంపబడ్డారు. ఈ నేపథ్యంలో ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (DMP) ఒక కీలక ప్రకటన చేసింది.

విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యలో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మేఘాలయ సరిహద్దుల ద్వారా భారతదేశానికి పారిపోయారని ఢాకా పోలీసులు పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ అధికారి ఏం చెప్పారు? నిందితులకు సహాయం చేసిన ఇద్దరు వ్యక్తులను భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘ద డైలీ స్టార్’ పత్రిక కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ అదనపు కమిషనర్ ఎస్.ఎన్. నజ్రుల్ ఇస్లాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హాదీ హత్యలో పాల్గొన్న ఫైసల్ కరీం మసూద్ మరియు ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు యువకులు స్థానికుల సహాయంతో మేఘాలయ సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించారని వివరించారు.

నిందితులు హలువాఘాట్ సరిహద్దును దాటి భారత్‌కు వెళ్లారని, అక్కడ ఒక వ్యక్తి వారిని రిసీవ్ చేసుకున్నాడని అధికారి తెలిపారు. ఆ తర్వాత వారు టాక్సీలో మేఘాలయ నగరం వైపు వెళ్లారని సమాచారం. అనుమానితులకు సహాయం చేసిన ఇద్దరిని భారత్‌లో అదుపులోకి తీసుకున్నట్లు అనధికారిక నివేదికలు అందాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

హింసలో చిక్కుకున్న బంగ్లాదేశ్: ఈ నెల ప్రారంభంలో ఢాకాకు 100 కి.మీ దూరంలో ఉన్న మైమన్సింగ్‌లో 29 ఏళ్ల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను ఒక ఇస్లామిక్ మూక కొట్టి చంపిన సంగతి తెలిసిందే. అతడిని చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేయడం మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిదర్శనం. ఈ డిసెంబర్ 18 నాటి మూకదాడికి సంబంధించి ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు.


Posted

in

by

Tags: