స్టేషన్లో ఎవరూ ఉండరు.. కానీ ఆ రైలు వస్తుంది. ఈ వింత ఘటన ప్రతిరోజూ కాల్వా రైల్వే స్టేషన్లో జరుగుతుందని కొందరి నమ్మకం. ప్రస్తుతం సోషల్ మీడియాలో థానేలోని కాల్వా స్టేషన్ గురించి అనేక భయంకరమైన విషయాలు గాలివాటంలా వ్యాపిస్తున్నాయి. ఇవి నిజంగా దెయ్యాలకు సంబంధించినవా లేక కేవలం వదంతులా అనేది ఎవరూ నిర్ధారించలేరు, కానీ వైరల్ అవుతున్న ఈ కథనం మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
అసలేం జరుగుతుంది? ‘జీ జెస్ట్’ (@zeezest) అనే సోషల్ మీడియా హ్యాండిల్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. కాల్వా స్టేషన్ పరిసరాల్లోని ఆటో డ్రైవర్లు మరియు కొందరు అధికారుల అనుభవం ప్రకారం.. ప్రతిరోజూ రాత్రి 12:00 నుండి 12:30 గంటల మధ్య చీకటి నుండి ఒక లోకల్ ట్రైన్ అతివేగంగా వచ్చి స్టేషన్లో ఆగుతుంది.
ఆ సమయంలో కాల్వా స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. స్టేషన్లో ఒక్క ప్రయాణీకుడు కూడా ఉండడు. ఈ ఘటనను చూసిన వారు చెప్పేదాని ప్రకారం.. అక్కడ కనీసం స్టేషన్ సిబ్బంది కూడా కనిపించరు.
అస్తిత్వంలో లేని గమ్యస్థానాలు: ఈ మిస్టరీ రైలు వచ్చినప్పుడు స్టేషన్లో ఎటువంటి అనౌన్స్మెంట్ (ప్రకటనలు) ఉండవు. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. కనీసం ఇండికేటర్ బోర్డులపై కూడా ఆ రైలు వివరాలు కనిపించవు. అసలు ఆ రైలు లోకల్ రైళ్ల షెడ్యూల్లోనే లేనట్లుగా అనిపిస్తుంది. కొన్ని సెకన్ల పాటు స్టేషన్లో ఆగిన తర్వాత ఆ రైలు ముందుకు కదులుతుంది.
అయితే, ఆ సమయంలో కొందరు ప్రయాణీకులు ఆ రైలు నుండి బయటకు దిగుతారు. అక్కడి ఆటో డ్రైవర్ల కథనం ప్రకారం.. ఆ ప్రయాణీకులు తాము వెళ్లాల్సిన అడ్రస్ అడుగుతారు. కానీ వారు చెప్పే ప్రాంతాలు ఆ పరిసరాల్లో ఇప్పుడు అసలు ఉనికిలోనే లేవు! అవి ఎప్పుడో చరిత్రలో కలిసిపోయిన ప్రదేశాలని వారు చెబుతుంటారు.
నిజమా? కల్పితమా? ఈ పోస్ట్ కింద అనేకమంది కాల్వా నివాసితులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొందరు ఇది కేవలం పుకారు అని కొట్టిపారేస్తుండగా, మరికొందరు ఇది నిజమేనని వాదిస్తున్నారు. ఇంకొందరు అది కార్ షెడ్‌కు వెళ్లే ట్రైన్ అయి ఉండొచ్చని అంటున్నారు, కానీ కాల్వా స్టేషన్‌కు కార్ షెడ్ ట్రైన్లు రావనేది రైల్వే నిపుణుల మాట. సత్యం ఏదైనా, ఈ ‘ఘోస్ట్ ట్రైన్’ కథనం మాత్రం ముంబై వాసులను భయపెడుతోంది.
