హార్ముజ్ జలసంధిలో ‘టోల్’ సెగ: ఒక్కో నౌకకు రూ.18 కోట్లు వసూలు చేస్తామన్న ఇరాన్.. మాకూ వాటా కావాలంటున్న అమెరికా!

టెహ్రాన్/న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగి ప్రపంచం ఊపిరి పీల్చుకున్నా, అంతర్జాతీయ వాణిజ్యానికి మాత్రం కొత్త గండం వచ్చి పడింది. ఇరాన్-అమెరికా మధ్య 15 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) కేంద్రంగా ఇరాన్ ప్రకటించిన నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

ఒక్కో నౌకకు రూ.18 కోట్ల టోల్!

యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకపై 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.18 కోట్లు) భారీ టోల్ విధిస్తామని ఇరాన్ బుధవారం ప్రకటించింది. యుద్ధ సమయంలో భారత్ వంటి మిత్రదేశాలకు తప్ప ఇతరులకు ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. ఇప్పుడు అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం మార్గాన్ని తెరిచినప్పటికీ, భారీ టోల్ ద్వారా ఆదాయం రాబట్టాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. అయితే, గతంలో భారత్‌కు ఇచ్చిన ‘ఉచిత ప్రయాణ’ సదుపాయం కొనసాగుతుందా లేక మనం కూడా టోల్ కట్టాలా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

మరో విచిత్రమైన పరిణామం ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ టోల్ వసూళ్లలో వాటా కోరడం ద్వారా పరోక్షంగా ఇరాన్ నిర్ణయానికి మద్దతు తెలపడం గమనార్హం.

భారత్‌పై రోజుకు రూ.200 కోట్ల భారం?

ఒకవేళ టోల్ నిబంధన అందరికీ సమానంగా వర్తిస్తే, భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది:

  • చమురు సెగ: భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 50%, ఎల్‌పిజిలో 80% ఈ హార్ముజ్ మార్గం గుండానే వస్తాయి.
  • ఖర్చుల మోత: రోజుకు సగటున 10-12 ట్యాంకర్లు భారత్‌కు వస్తుంటాయి. లెక్క ప్రకారం రోజుకు రూ.180 నుండి రూ.200 కోట్ల అదనపు భారం పడవచ్చు.
  • ధరల విస్ఫోటనం: రవాణా ఖర్చులు రెట్టింపు అయితే పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ఈ ‘టోల్ బాదుడు’ వల్ల సామాన్యుడికి ఆ ఫలాలందవు.
ఒమన్‌, భారత్‌ల నిరసన

ఇరాన్ నిర్ణయాన్ని పొరుగు దేశమైన ఒమన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. భారత్ కూడా హార్ముజ్ జలసంధిలో రాకపోకలు పూర్తిగా స్వేచ్ఛగా, సురక్షితంగా ఉండాలని తన నిలకడైన వాదనను వినిపిస్తోంది.

39 రోజుల యుద్ధానికి బ్రేక్.. పాక్ మధ్యవర్తిత్వం!

ఒక్క రాత్రిలో ఇరాన్ ఉనికిని తుడిచేస్తానన్న ట్రంప్, గడువు ముగియడానికి గంటన్నర ముందే కాల్పుల విరమణ ప్రకటించడం విశేషం. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. ఏప్రిల్ 10 నుండి ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య తుది విడత చర్చలు జరగనున్నాయి.


Posted

in

by

Tags: