టెహ్రాన్/వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటి హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే, ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిలోని ప్రధాన మార్గంలో సముద్ర గనులు (Sea Mines) ఉన్నాయని, నౌకలు ప్రమాదానికి గురికాకుండా ఉండాలంటే తమ ‘ప్రత్యామ్నాయ మార్గం’లోనే ప్రయాణించాలని హుకూం జారీ చేసింది.
సముద్ర గనుల భయం.. ఇరాన్ పెట్టిన కొత్త రూట్!
ప్రపంచంలోని ఐదో వంతు (20%) చమురు రవాణా ఈ ఇరుకైన జలసంధి గుండానే సాగుతుంది. గత నెల రోజులుగా సాగిన యుద్ధం కారణంగా ఈ మార్గంలో భారీగా మైన్లు అమర్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) వెల్లడించింది.
- కొత్త నిబంధన: హార్ముజ్ మధ్యలో ఉన్న సాధారణ మార్గాన్ని వదిలి, ఇరాన్ సరిహద్దుల వైపుగా, హోర్ముజ్ మరియు కాసిమ్ దీవుల గుండా ప్రయాణించాలని నౌకలను ఆదేశించింది.
- నియంత్రణ: ఈ నిర్ణయం ద్వారా అంతర్జాతీయ జలమార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన సంపూర్ణ అదుపులోకి తెచ్చుకోవాలని చూస్తోంది. తమ నావికా దళం సూచించిన మార్గంలోనే నౌకలు వెళ్లడం ద్వారా ఇరాన్ అక్కడ ‘గేట్ కీపర్’గా వ్యవహరించనుంది.
ట్రంప్ అల్టిమేటం.. గంట ముందు కుదిరిన ‘సంధి’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కేవలం ఒక గంట ముందే ఏప్రిల్ 8న ఈ 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
“ఇరాన్ గనుక మా మాట వినకపోతే ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాం” అని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో టెహ్రాన్ ఒక అడుగు వెనక్కి వేసింది. అయితే, లేబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో ఈ ‘సీజ్ఫైర్’ ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానంగానే ఉంది.
యుద్ధం మొదలైంది ఇలా..
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత పశ్చిమ ఆసియా మొత్తం అగ్నిగుండంగా మారింది. ప్రతీకారంగా ఇరాన్ మార్చి నుంచి హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి.
అంతిమ లక్ష్యం ఏంటి?
తాత్కాలికంగా జలసంధిని తెరిచినట్లు ఇరాన్ నటిస్తున్నా, ‘మైన్ల’ సాకుతో అంతర్జాతీయ నౌకాయానాన్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటోంది. ఇది అమెరికా ప్రయోజనాలకు గండికొట్టే వ్యూహమా? లేక నిజంగానే సముద్ర భద్రతా చర్యలా? అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వేసిన ఈ కొత్త రూట్.. ప్రపంచ ఇంధన మార్కెట్లో కొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
