హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఏం చేస్తున్నావ్? గదిలోకి వచ్చి చెంపదెబ్బ కొట్టిన తల్లి! అన్నయ్య అంతకుమించి… సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో..!!!

ఇంట్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని చదువుకుంటున్న యువతిని, ఆమె తల్లి మరియు సోదరుడు మందలించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరలవుతోంది.

కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ గొడవ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానాలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘X’ (ట్విట్టర్) వేదికగా @Kritical_62 అనే వినియోగదారుడు ఈ వీడియోను పంచుకున్నారు. ఆ అమ్మాయితో ప్రవర్తించిన తీరు అంగీకరించదగ్గది కాదని, ఒకవేళ ఆమె ప్రియుడితో మాట్లాడుతున్నా అందులో తప్పేమీ లేదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

హెడ్‌ఫోన్స్ కారణంగా మొదలైన గొడవ వీడియోలో, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని కూర్చున్న అమ్మాయిని ఆమె సోదరుడు “ఏం చేస్తున్నావ్?” అని అడుగుతాడు. కొన్ని క్షణాల్లోనే అక్కడికి వచ్చిన తల్లి, ఆ యువతిని చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. దీంతో ఇంట్లో తీవ్ర వాగ్వాదం మొదలైంది.

ఆ యువతి తాను చదువుకుంటున్నానని పుస్తకాలు కూడా చూపిస్తుంది. కానీ, ఇంటికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని తల్లి ఆరోపిస్తుంది. హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్ల పిలిచిన మాట వినిపించలేదని ఆ అమ్మాయి వివరణ ఇస్తుంది.

“నేను చదువుకుంటున్నాను కదా” వాగ్వాదం ముదరడంతో, ఆగ్రహించిన ఆ యువతి తన చేతిలో ఉన్న పుస్తకాన్ని గోడకేసి కొట్టి, “నేను చదువుకుంటున్నాను. అనవసరంగా నన్ను ఎందుకు విసిగిస్తున్నారు?” అని అరుస్తుంది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటేనే తాను ఏకాగ్రతతో చదువుకోగలనని ఆమె చెబుతుంది. ఆ తర్వాత, వంట చేయలేదని తల్లి ప్రశ్నించగా, “మీ పనులు మీరే చేసుకోండి” అని ఆ అమ్మాయి సమాధానమిస్తుంది. దీంతో కోపం పట్టలేకపోయిన తల్లి, “ఇలాగే ఉంటే పెళ్లయ్యాక ఏమవుతుంది?” అని అనగా, “మీకు ఏమైందో అదే నాకూ అవుతుంది” అని ఆ అమ్మాయి ఎదురు సమాధానం చెప్పడం వీడియోలో ఉంది.

భిన్నమైన అభిప్రాయాలు ఈ మొత్తం ఘటనను ఆ అమ్మాయి సోదరుడే ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువతికి మద్దతుగా మాట్లాడుతుంటే, మరికొందరు కుటుంబ సభ్యుల కోపంలోనూ అర్థం ఉందని అభిప్రాయపడుతున్నారు.


Posted

in

by

Tags: