ఒక్కోసారి ₹2,500 లావాదేవీ అనుకున్న దానికంటే చాలా ఖరీదైనదిగా మారుతుంది. ఏడాదికి ₹80 లక్షల భారీ వేతనం తీసుకునే 36 ఏళ్ల మహిళా ప్రొఫెషనల్ ఎదుర్కొన్న అనుభవాన్ని నళిని ఉనగర్ అనే యూజర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆమె చేసిన ట్వీట్ ప్రకారం.. ఒక మ్యాచ్ మేకింగ్ సర్వీస్ ద్వారా పరిచయమైన వ్యక్తితో సదరు మహిళ మూడుసార్లు డేట్‌కు వెళ్లింది. మొదటి రెండుసార్లు బిల్లును ఆ వ్యక్తే చెల్లించాడు. మూడవసారి డేట్‌కు వెళ్లినప్పుడు బిల్లు ₹5,000 వచ్చింది. ఈసారి బిల్లును ఇద్దరం పంచుకుందాం (Split) అని ఆ వ్యక్తి ఆమెను అడిగాడు. ఆమె తన వాటా చెల్లించి, నవ్వుతూ అక్కడి నుండి వచ్చేసింది.
కానీ మరుసటి రోజే ఆ సంబంధం వద్దు అంటూ మ్యాచ్ మేకర్‌కు ఫోన్ చేసింది. ఆ పోస్ట్ ప్రకారం ఆమె ఏమన్నదంటే: “నాకు ఇది ఇక చాలు. అతనితో నేను ముందుకు వెళ్లలేను. ఇది డబ్బు గురించి కాదు. నేను బాగానే సంపాదిస్తాను. ఆ బిల్లును పదిసార్లు నేనే కట్టగలను. కానీ, అతను నా కోసం ఖర్చు పెట్టడం విలువైనదా కాదా అని లెక్కలు వేసుకుంటున్నట్లు నాకు అనిపించింది. అలాంటి ఆలోచనా ధోరణి ఉన్న వ్యక్తితో నా జీవితాన్ని గడపలేను.”
ఈ పోస్ట్ ‘X’ (గతంలో ట్విట్టర్) లో భారీ చర్చకు దారితీసింది. కొందరు ఆమె తన “ప్రమాణాల” (Standards) కోసం నిలబడిందని సమర్థిస్తుంటే, మరికొందరు సమానత్వం గురించి ఆమె ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని విమర్శిస్తున్నారు.
“2026లో డేటింగ్ అనేది ఒకరి ఉద్దేశాలను మరొకరు పరీక్షించుకునే మానసిక యుద్ధంలా మారింది” అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, “బిల్లు కట్టడం అనేది సెకండరీ, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం” అని మరొకరు మద్దతు తెలిపారు.
మరోవైపు, ఆమె వయస్సు మరియు ఆదాయ స్థాయిని బట్టి చూస్తే బిల్లు పంచుకోవడం అనేది పెద్ద సమస్య కాకూడదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. “అతను చాలా అదృష్టవంతుడు.. కేవలం ₹2,500 ఇవ్వలేని మహిళ, భవిష్యత్తులో ఇంకేం తోడుగా ఉంటుంది?” అని ఒకరు ఎద్దేవా చేశారు. “36 ఏళ్ల వయస్సులో మంచి సంబంధం దొరకడమే కష్టం, దానికి ₹80 లక్షల జీతం పరిష్కారం కాదు. ఇలాంటి చిన్న విషయాల కోసం ఆమె సమయాన్ని వృధా చేసుకుంటోంది” అని ఇంకొకరు రాశారు.
మరొక యూజర్ నేటి డేటింగ్ సంస్కృతిని విమర్శిస్తూ.. “మాకు సమానత్వం కావాలి, కానీ అది మాకు ప్రయోజనం కలిగించినప్పుడే. మేము ఆర్థికంగా స్వతంత్రులం, కానీ ఎవరైనా బిల్లు పంచుకుందాం అంటే ఫీల్ అవుతాం. ఎదుటివారు బిల్లు కట్టినంత కాలం డేట్‌కు వెళ్లడం మాకు ఇష్టం, కానీ మమ్మల్ని కూడా కట్టమంటే వారు చెడ్డవారైపోతారు” అంటూ ఘాటుగా స్పందించారు.
