ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారిని ఇంటర్వ్యూ తర్వాత కంపెనీలు పట్టించుకోకుండా (ఘోస్టింగ్) వదిలేయడం సాధారణమే. కానీ, తాను పనిచేస్తున్న సొంత కంపెనీలోనే ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఆ ఉద్యోగిని పట్టించుకోకుండా వదిలేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
బాధిత ఉద్యోగి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో, అతను తన కంపెనీలోనే మరో ఉన్నత పదవికి దరఖాస్తు చేసుకుని, వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు పలు దశల ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. వచ్చే వారాంతానికి సమాధానం చెబుతామని చెప్పిన హెచ్‌ఆర్ (HR) బృందం, ఆ తర్వాత ఎలాంటి బదులివ్వకుండా అతన్ని నిర్లక్ష్యం చేసింది.
ఆ తర్వాత సదరు ఉద్యోగి మేనేజర్‌ను సంప్రదించి అడగగా, ప్రక్రియ పూర్తి కాగానే కచ్చితమైన సమాధానం వస్తుందని చెప్పాడు. కానీ, మళ్లీ రెండు వారాలు ఎదురుచూసినా ఎలాంటి సమాధానం రాలేదు. చివరికి, ఆ పదవికి వేరొకరు ఎంపికైనట్లు కంపెనీ సాధారణ మెసేజింగ్ గ్రూప్ (స్లాక్) ద్వారా ఆ ఉద్యోగి తెలుసుకున్నాడు.
తాను రిజెక్ట్ అయినందుకు బాధపడటం లేదని, వేరొకరికి ఆ ఉద్యోగం రావడం తనకు సమస్య కాదని చెప్పిన ఆ ఉద్యోగి.. “సొంత కంపెనీలోనే ఇంటర్వ్యూ పూర్తి చేసి ఎదురుచూస్తున్న నాకు కనీసం ఒక రిజెక్షన్ ఈమెయిల్ కూడా పంపకుండా నిర్లక్ష్యం చేయడమే తీవ్ర కోపం తెప్పిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఈ ఘటనను చూసిన పలువురు, “సొంత ఉద్యోగినే ఇలా చూసే కంపెనీ, బయటి నుంచి వచ్చే అభ్యర్థులను ఇంకెలా చూస్తుంది?” అని, “వెంటనే ఆ కంపెనీని వదిలేసి వేరే మంచి కంపెనీలో ఉద్యోగం చూసుకోండి” అని అతనికి సలహాలు ఇస్తున్నారు.

Leave a Reply