“అంబులెన్స్ లేదు.. రోడ్డు వేయలేదు..!” ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇలానా..? మంచంపై తీసుకెళ్తుండగా మృతి చెందిన గిరిజన మహిళ.. షాకింగ్ వీడియో..!!!

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో సరైన రోడ్డు సౌకర్యం, అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో, అనారోగ్యంతో ఉన్న ఒక గిరిజన మహిళను మంచంపై పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో, మార్గమధ్యలోనే ఆమె మృతి చెందిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది.

అత్యవసర వైద్య వాహనాలు అందుబాటులో లేకపోవడంతో, ఆ మహిళను మంచంపై ఉంచి, సుమారు 4 నుండి 5 గురు కుటుంబ సభ్యులు మరియు స్థానికులు కలిసి భుజాల మీద మోసుకుంటూ, బురదతో నిండిన కాలిబాటలో సుదీర్ఘ దూరం నడిచి వెళ్లారు. అయితే, ఆసుపత్రికి చేరుకోకముందే ఆమె మృతి చెందడం బాధాకరం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా రేవా జిల్లాకు చెందిన వారే అయి ఉండి కూడా ఇలాంటి దుస్థితి కొనసాగుతుండటంపై ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు, అంబులెన్స్ సేవలు అందడం లేదని, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.


Posted

in

by

Tags: