అక్కాచెల్లెళ్లు ముగ్గురినీ పెళ్లాడి ఒకే ఇంట్లో కాపురం; కరెంటు బిల్లు కట్టలేక పిల్లల ఫోన్లు అమ్మకం.. రూ. 2 కోట్ల అప్పు.. ముగ్గురు బాలికల ఆత్మహత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు బాలికలు అపార్ట్‌మెంట్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న కేసులో, వారి తండ్రి చేతన్ కుమార్ గతాన్ని పోలీసులు తవ్వి తీస్తున్నారు. 2015లో సాహిబాబాద్‌లో ఒక మహిళ భవనం పైనుండి పడి మరణించింది. ఆమె చేతన్ కుమార్‌తో సహజీవనం (Live-in partner) చేసిన వ్యక్తి అని, అప్పట్లో దానిని ఆత్మహత్యగా భావించి కేసు క్లోజ్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు అతని ముగ్గురు కుమార్తెలు కూడా అదే రీతిలో ఆత్మహత్య చేసుకోవడంతో, ఆ పాత కేసును మళ్లీ విచారించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ నిమిష్ పాటిల్ తెలిపారు.

ముగ్గురు సోదరీమణులతో కాపురం: చేతన్ కుమార్ కుటుంబ నేపథ్యం అధికారులను విస్మయానికి గురిచేసింది. అతను సుజాత, హీనా, టీనా అనే ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకుని వారందరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. ఆత్మహత్య చేసుకున్న నిషిక (16) సుజాత కుమార్తె కాగా, ప్రాచి (14), పాఖి (12) హీనా కుమార్తెలు. మూడవ భార్య టీనాకు నాలుగేళ్ల పాప ఉంది.

ఆర్థిక ఇబ్బందులు: స్టాక్ మార్కెట్ బ్రోకర్ అయిన చేతన్ కుమార్ దాదాపు రూ. 2 కోట్ల అప్పుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కరెంటు బిల్లు కట్టడానికి తన కుమార్తెల సెల్ ఫోన్లను కూడా అతను అమ్మేశాడు. డబ్బుల్లేక, చదువుపై ఆసక్తి లేక ఆ బాలికలు గత రెండేళ్లుగా బడికి కూడా వెళ్లడం లేదని సమాచారం.

కొరియన్ గేమ్ ప్రభావం? పోలీసులకు బాలికల గదిలో 8 పేజీల డైరీ దొరికింది. అందులో వారికి కొరియన్ సంస్కృతిపై ఉన్న విపరీతమైన పిచ్చి గురించి రాసుకున్నారు. వారు తమకు తాము కొరియన్ పేర్లు కూడా పెట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో ఒక కొరియన్ టాస్క్ ఆధారిత గేమ్ ఆడుతూ, దాని చివరి దశలో భాగంగానే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్లు లాక్కున్నారనే కోపంతో గత బుధవారం తెల్లవారుజామున 2:15 గంటలకు ముగ్గురూ 9వ అంతస్తు నుండి దూకి ప్రాణాలు విడిచారు.


Posted

in

by

Tags: