ఒక యువతి జీవితం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా మోసానికి గురైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వ్యక్తి ఆమె నుండి ఏకంగా రూ. 1.53 కోట్లు వసూలు చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వమని కోరినప్పుడు తెలిసిన నిజం ఆమెను షాక్‌కు గురిచేసింది. ఆ యువకుడి కుటుంబం మొత్తం ఈ మోసంలో పాలుపంచుకుంది. అతను తన ‘అక్క’ అని ఎవరినైతే పరిచయం చేశాడో, ఆమె అసలు అక్క కాదు.. స్వయానా అతని భార్య అని తేలింది.
మొదటి భేటీలోనే కోటీశ్వరుడిగా బిల్డప్: బెంగళూరులోని కెంగేరి పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఫిర్యాదుదారు నవ్యశ్రీ వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తోంది. మార్చి 2024లో ఆమెకు విజయ్ రాజ్ గౌడ అనే వ్యక్తి ఒక మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను ‘VRG ఎంటర్ప్రైజెస్’ యజమానినని, బెంగళూరులో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని నమ్మించాడు. తనకు రూ. 715 కోట్ల ఆస్తి ఉందని, ఈడీ (ED) కేసుల వల్ల బ్యాంక్ అకౌంట్లు ఇబ్బందుల్లో ఉన్నాయని నమ్మించి ఆమెను బుట్టలో వేసుకున్నాడు.
కుటుంబం మొత్తం కలిసి మోసం: అతను తన కుటుంబాన్ని కూడా నవ్యశ్రీకి పరిచయం చేశాడు. అతని తండ్రి తాను రిటైర్డ్ తహసీల్దార్ అని చెప్పుకున్నాడు. తన భార్యను ‘అక్క’గా పరిచయం చేశాడు. నమ్మకం కుదిరిన తర్వాత, వ్యాపార పెట్టుబడుల పేరుతో నవ్యశ్రీ నుండి మాత్రమే కాకుండా, ఆమె స్నేహితులు మరియు తల్లిదండ్రుల నుండి కూడా దఫదఫాలుగా రూ. 1.75 కోట్లు వసూలు చేశాడు. అందులో కేవలం రూ. 22 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చాడు.
నిజం తెలిసిన విధం: బాకీ ఉన్న రూ. 1.53 కోట్లు అడగడానికి నవ్యశ్రీ అతని ఇంటికి వెళ్లగా, అక్కడ అసలు విషయం బయటపడింది. విజయ్ రాజ్‌కు మూడేళ్ల క్రితమే పెళ్లయిందని, అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడని తెలిసింది. అక్క అని పరిచయం చేసిన సుశీదీప అనే మహిళ అతని భార్య అని తెలిసి నవ్యశ్రీ హతాశురాలైంది. డబ్బులు అడిగితే తనను, తన స్నేహితులను చంపేస్తామని బెదిరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
