చండీగఢ్: తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే నెపంతో కన్నబిడ్డలకు ఎలుకల మందు ఇచ్చి చంపిన ఒక తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని బటిండాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలిని జాసీ కౌర్‌గా గుర్తించారు.
ఎనిమిదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని ఆమె అత్యంత క్రూరంగా హతమార్చింది. పెద్ద కూతురు మరణించిన రెండు వారాల తర్వాత కుమారుడు కూడా మరణించాడు.
అసలేం జరిగింది? 15 రోజుల క్రితం ఎనిమిదేళ్ల సుఖ్‌ప్రీత్ కౌర్ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి ఆరేళ్ల ఫతేవీర్ కూడా మరణించాడు. తక్కువ వ్యవధిలో ఇద్దరు పిల్లలు మరణించడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.
పోలీసుల వెల్లడి: “ముందుగా ఎనిమిదేళ్ల కూతురిని, ఆ తర్వాత కొద్దిరోజులకే ఆరేళ్ల కొడుకుని జాసీ కౌర్ హత్య చేసింది. ఈ రెండు హత్యల వెనుక పక్కా ప్లాన్ ఉంది. ఎలుకల మందు ఇచ్చి చంపినట్లు ఆమె ఒప్పుకుంది” అని పోలీస్ అధికారి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కుట్రలో జాసీ సోదరి మోటో కౌర్ మరియు లఖీ సింగ్ అనే వ్యక్తి కూడా భాగస్వాములని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం జాసీ మరియు ఆమె సోదరిని అరెస్ట్ చేయగా, మూడవ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
