లక్నో, ఏప్రిల్ 28: సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మంగళవారం మేదాంత ఆసుపత్రికి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌ను పరామర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై నిరసన తెలుపుతూ అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మను తగులబెడుతున్న సమయంలో ఆమె ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది.
అసలేం జరిగింది? బహ్రైచ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు ఇండియా కూటమికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. దిష్టిబొమ్మలో పెట్రోల్ ఎక్కువగా పోయడం వల్ల, ఆమె అగ్గిపెట్టె వెలిగించగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఆమె ముఖానికి, జుట్టుకు అంటుకున్నాయి. కార్యకర్తలు వెంటనే స్పందించి మంటలను ఆర్పేసి, ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అఖిలేష్ యాదవ్ స్పందన: ఈ పరామర్శ అనంతరం అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ లో స్పందిస్తూ.. “మేము సమాజంలో మంటలు పెట్టాలని అనుకోవడం లేదు, సామరస్యపు జల్లులు కురవాలని కోరుకుంటున్నాం. మా సానుకూల రాజకీయ సంప్రదాయం మాకు ఇదే నేర్పింది. అందుకే బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ గారిని కలిసి, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. రాజకీయాలు రాజకీయాలే, కానీ మానవీయ సంబంధాలకు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది,” అని పేర్కొన్నారు.
అంతకుముందు ఈ ఘటనపై వీడియో షేర్ చేస్తూ, “మంటలు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి! గాయపడిన మహిళకు సరైన చికిత్స అందించాలి,” అని ఆయన చమత్కరిస్తూనే ఆందోళన వ్యక్తం చేశారు.
