బీజింగ్: తమ దేశ సముద్ర సరిహద్దుల్లో విదేశీ నిఘా సంస్థలు (గూఢచారి సంస్థలు) తాబేళ్లు, చేపల వంటి సముద్ర జీవులను ఉపయోగించి అత్యంత రహస్యంగా నిఘా వేస్తున్నాయని చైనా తీవ్ర ఆరోపణలు చేసింది.
చైనా జాతీయ భద్రతా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక హెచ్చరిక ప్రకారం.. సముద్రంలో నివసించే భారీ పరిమాణంలో ఉండే తాబేళ్లు, పెద్ద చేపల శరీరంలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ సెన్సార్లను అమర్చి, వాటిని గూఢచర్య పనుల కోసం విదేశీ శక్తులు ఉపయోగిస్తున్నాయి.
ఈ “గూఢచారి తాబేళ్లు” (Spy Turtles) నిర్దేశిత సముద్ర ప్రాంతాలలో ఈదుకుంటూ వెళ్తూ.. అక్కడి నీటి ఉష్ణోగ్రత, లవణీయత (ఉప్పు శాతం) మరియు సముద్ర ప్రవాహాల వంటి అత్యంత కీలకమైన భౌగోళిక డేటాను సేకరిస్తాయి. ఆ తర్వాత ఆ సమాచారాన్ని శాటిలైట్ (కృత్రిమ ఉపగ్రహాల) ద్వారా వెనువెంటనే విదేశీ నిఘా కేంద్రాలకు చేరవేస్తున్నాయి. సముద్ర గర్భంలో సాగుతున్న ఈ నయా డిజిటల్ నిఘా యుద్ధం తమ జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించిందని చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
చైనా సముద్ర గర్భ రహస్యాల చోరీ – సబ్‌మెరైన్ మ్యాప్స్!
సముద్ర జీవుల ద్వారా సేకరిస్తున్న ఈ కీలక సమాచారంతో విదేశీ నిఘా సంస్థలు చైనా తీరప్రాంతాలకు సంబంధించిన అత్యంత ఖచ్చితమైన “సబ్‌మెరైన్ మ్యాప్స్” (నీటి మునిగే జలాంతర్గామి మ్యాప్‌లు) తయారు చేస్తున్నాయి. ఈ నిఘా మ్యాప్‌ల సహాయంతో చైనా నౌకాదళ రక్షణ వలయంలోని బలహీనమైన ప్రాంతాలను విదేశాలు సులభంగా గుర్తించగలవని.. తద్వారా శత్రుదేశాల జలాంతర్గాములు చైనాకు తెలియకుండానే వారి సముద్ర సరిహద్దుల్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ఇది దారితీస్తుందని చైనా రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, తమ జాతీయ భద్రతకు భంగం కలిగించే ఇటువంటి ఆధునిక నిఘా పరికరాలను గానీ, లేదా శరీరానికి సెన్సార్లు అమర్చిన అనుమానాస్పద సముద్ర జీవులను గానీ గుర్తిస్తే తక్షణమే సమాచారం అందించాలని చైనా ప్రభుత్వం తమ దేశ మత్స్యకారులను, సముద్ర పరిశోధకులను ఆదేశించింది. ఇలాంటి గూఢచారి జీవులను లేదా పరికరాలను కనిపెట్టి అప్పగించిన వారికి భారీ మొత్తంలో (దాదాపు రూ. 57 లక్షలు) నగదు బహుమతిగా ఇస్తామని చైనా ప్రకటించింది.
