చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా అభిమానుల మధ్య చర్చనీయాంశంగా ఉండే అజిత్-విజయ్ స్నేహం గురించి దర్శకుడు వెంకట్ ప్రభు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో అజిత్ కుమార్ మరియు విజయ్ యొక్క నిజ జీవిత వ్యక్తిత్వాల గురించి ఆయన పంచుకున్న విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వెంకట్ ప్రభు ఏమన్నారంటే.. అజిత్ కుమార్ గురించి చెబుతూ.. “అజిత్ చాలా ఓపెన్ మైండెడ్ పర్సన్. తన భావోద్వేగాలను ఏమాత్రం దాచుకోకుండా బయటపెడతారు. కొన్నిసార్లు ఎమోషనల్ అయి వెంటనే కళ్లనీళ్లు పెట్టుకుంటారు. తన పక్కన ఉన్న వారిపై ఆయన చూపించే ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది. మనల్ని చూసినప్పుడు ఎంతో సంతోషంతో గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ సమయంలో సరదాగా కొన్ని బూతులు తిడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు” అని వెంకట్ ప్రభు నవ్వుతూ చెప్పుకొచ్చారు.
అదే సమయంలో విజయ్ గురించి మాట్లాడుతూ.. “విజయ్ వ్యక్తిత్వం అజిత్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. విజయ్ తన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు, వాటిని నియంత్రించుకుంటారు. పైకి చాలా సైలెంట్‌గా కనిపిస్తారు కానీ, ఆయన లోపల చాలా ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఎవరినైనా కౌగిలించుకుని మాట్లాడినప్పుడే ఆ ప్రేమ యొక్క లోతు మనకు అర్థమవుతుంది” అని తెలిపారు.
అజిత్-విజయ్ మధ్య గొడవ? అజిత్ కుమార్ మరియు విజయ్ ఇద్దరినీ కలిపి ఒక సినిమా తీయాలనేది తన చిరకాల కోరిక అని వెంకట్ ప్రభు అన్నారు. “దీని గురించి ఒకసారి నేను వారిద్దరితో మాట్లాడినప్పుడు, నా కళ్ల ముందే ఇద్దరూ గొడవ పడ్డారు. ‘నేనే విలన్ పాత్రలో నటిస్తాను’ అని ఇద్దరూ పట్టుబట్టారు. అప్పుడు నేను ఇంకా కథ కూడా సిద్ధం చేయలేదు.. కథ లేకుండానే మీరిలా గొడవ పడుతున్నారేంటి అని అడిగాను. కానీ వారిద్దరూ మాత్రం ‘కథ ఏదైనా పర్వాలేదు.. కానీ విలన్‌గా మాత్రం నేనే నటిస్తాను’ అని ఒకరితో ఒకరు వాదించుకున్నారు” అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
వెంకట్ ప్రభు గురించి.. వెంకట్ ప్రభు తనదైన శైలిలో కథలు చెప్పే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ‘చెన్నై 600028’తో పరిచయమైన ఆయన, అజిత్ నటించిన ‘మంగాత్తా’తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా అజిత్ సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది. విజయ్ కెరీర్లో కూడా ఆయన ఒక బ్లాక్ బస్టర్ సినిమా (GOAT) అందించారు. ఇద్దరు స్టార్ హీరోలతో మంచి స్నేహం ఉన్న దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
