లండన్: సాధారణ కడుపు ఉబ్బరం, అజీర్తి అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని చెప్పడానికి బ్రిటన్‌కు చెందిన లారెన్స్ ఫాక్స్ (67) కథ ఒక హెచ్చరిక. నిత్యం కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే ఇనో, సోడాలు తాగుతూ కాలం గడిపిన ఆయనకు, చివరకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆయనకు ‘స్టేజ్-4’ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని, కేవలం తొమ్మిది నెలలు మాత్రమే బతుకుతారని మరణ శాసనం వినిపించారు.
అసలేం జరిగింది?
2024 జూలైలో లారెన్స్‌కు జీర్ణక్రియ సమస్యలు మొదలయ్యాయి. ఏది తిన్నా అరగకపోవడం, తిన్న వెంటనే విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపించాయి. గతంలో ఉన్న జీర్ణకోశ సమస్య (డైవర్టికులిటిస్) అనుకుని ఆయన ఇంటి చిట్కాలు పాటిస్తూ వచ్చారు. కానీ సమస్య తగ్గకపోగా, సుమారు ఆరు కిలోల బరువు తగ్గారు.
వైద్యులు కూడా మొదట ఇన్ఫెక్షన్ అనుకుని యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఆగస్టులో ఎండోస్కోపీ చేసినా ఏమీ తేలలేదు. కానీ నవంబర్‌లో చేసిన సీటీ స్కాన్ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆయన కడుపులో 75 మిల్లీమీటర్ల భారీ గడ్డ (ట్యూమర్) ఉన్నట్లు తేలింది. అది ప్రధాన రక్తధమనికీ అతి సమీపంలో ఉండటంతో ఆపరేషన్ చేయడం అసాధ్యమని డాక్టర్లు తేల్చేశారు.
నిర్లక్ష్యమే శాపమైంది..
లారెన్స్ తల్లి అప్పట్లో అనారోగ్యంతో మరణించడంతో, ఆ బాధలో ఉండి తన లక్షణాలను ఆయన పట్టించుకోలేదు. వాస్తవానికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది. దీని లక్షణాలు చాలా సామాన్యంగా ఉంటాయి:
- తరచుగా అజీర్తి, కడుపు నొప్పి.
- ఆకస్మికంగా బరువు తగ్గడం.
- మల విసర్జన అలవాట్లలో మార్పులు (విరేచనాలు లేదా మలబద్ధకం). ఈ లక్షణాలు సాధారణమైనవిగా అనిపించడం వల్లే మెజారిటీ కేసులు స్టేజ్-4 వరకు వెళ్తున్నాయి.
చావు అంచుల్లో నుంచి పోరాటం
వైద్యులు గడువు విధించినా లారెన్స్ అధైర్యపడలేదు. 12 రౌండ్ల కఠినమైన కీమోథెరపీ తీసుకున్నారు. ప్రతి రౌండ్ 9 గంటల పాటు సాగేది. ఆశ్చర్యకరంగా, చికిత్స తర్వాత ఆ గడ్డ 75 మి.మీ నుంచి 15 మి.మీకి తగ్గిపోయింది. క్యాన్సర్ స్టేజ్ కూడా తగ్గడంతో ఆయనలో మళ్ళీ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఆయన గోల్ఫ్ ఆడుతూ, స్విమ్మింగ్ చేస్తూ సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కుమారుడు జేమీ కూడా తండ్రి చికిత్స కోసం, క్యాన్సర్ అవగాహన కోసం మారథాన్‌లో పాల్గొని నిధులు సేకరించారు.
హెచ్చరిక: “జీర్ణక్రియలో నిరంతరం మార్పులు వస్తున్నా, బరువు తగ్గుతున్నా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే నిపుణులైన డాక్టర్లను సంప్రదించండి” అని లారెన్స్ ఇప్పుడు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మన కడుపు చెప్పే చిన్న చిన్న సంకేతాలే రేపటి ప్రాణాపాయం నుంచి మనల్ని కాపాడగలవు.
